Kovelamudi Ravindra: గుంటూరు మేయర్ బరిలో నిలిచిన వైసీపీకి షాక్... టీడీపీ విజయం

Guntur Mayor Election Results TDPs Triumph Over YSRCP
  • గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
  • చివరి నిమిషంలో బరిలోకి దిగిన వైసీపీ
  • వైసీపీకి దక్కని మేయర్ పదవి.. కూటమి గెలుపు
గుంటూరు నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా కూటమి అభ్యర్థి, టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర (నాని) ఎన్నికయ్యారు. గత మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు నూతన మేయర్ ఎన్నికను అధికారులు నిర్వహించారు. ఈ ఎన్నికలో కూటమి తరఫున కోవెలమూడి రవీంద్ర విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు.

నిన్నటి వరకు ఈ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని అందరూ భావించారు. అయితే, ఈ ఉదయం అనూహ్యంగా వైసీపీ తరఫున 30వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ నెలకొంది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. కూటమి తరఫున కోవెలమూడి రవీంద్ర, వైసీపీ పక్షాన అచ్చాల వెంకటరెడ్డి మేయర్ పదవికి పోటీ పడ్డారు.

వాస్తవానికి గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లతో సంపూర్ణ ఆధిక్యం ఉండేది. తెలుగుదేశం పార్టీకి 9, జనసేనకు ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సుమారు 19 మంది వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామంతో కార్పొరేషన్‌లో వైసీపీ బలం తగ్గగా, కూటమి బలం గణనీయంగా పెరిగింది.

మారిన బలాబలాల నేపథ్యంలో మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇరు పార్టీలు తమ సభ్యులకు విప్‌లు జారీ చేశాయి. అయినప్పటికీ, కోవెలమూడి రవీంద్ర సులభంగా విజయం సాధించారు. దీంతో గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రక్రియ అనంతరం అధికారులు ఫలితాన్ని అధికారికంగా వెల్లడించారు. 
Kovelamudi Ravindra
Guntur Mayor Election
TDP
YSRCP
Andhra Pradesh Politics
Guntur Municipal Corporation
Achaala Venkat Reddy
Municipal Election
India Politics

More Telugu News