Chandrababu: ప్రధాని మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దాం: సీఎం చంద్ర‌బాబు

PM Modi to Visit Amaravati Chandrababu Naidus Preparations
  • రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి ప్రధాని మోదీ
  • ఈ నేప‌థ్యంలో ఎన్డీఏ నేతలతో ముఖ్య‌మంత్రి టెలీకాన్ఫరెన్స్
  • సభకు తరలి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదన్న చంద్ర‌బాబు
  • అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అన్న సీఎం
అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ పర్యటనపై ఎన్డీఏ నేతలకు సీఎం చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. 

అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల గర్వకారణం
"ఒక కుటుంబం నివసించేందుకు మంచి ఇల్లు ఉండాలని ఎలా అనుకుంటామో ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి కూడా రాజధాని ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీఏ విధానం కాబట్టే 2014 నుంచి కేంద్ర విద్యా సంస్థలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఏర్పాటు చేశాం. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. తెలంగాణకు హైదరాబాద్, కర్ణాట‌కకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై రాజధానుల ద్వారా 70 శాతం ఆదాయం వస్తోంది. మనకు కూడా మంచి నగరం ఉంటే రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం సమకూరుతుందని అమరావతిని నిర్మిస్తున్నాం. రాష్ట్రానికి అమరావతి ఆత్మ వంటిది" అని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. 

ప్రజల్ని తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. వారు ఇచ్చిన భూముల్లోనే రాజధాని నిర్మించడంతో పాటు తిరిగి వారికి రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తున్నాం. రాజధానిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయి. రోడ్ల నిర్మాణం జరిగితే రవాణా సౌకర్యం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. కానీ  కొన్ని వ్యతిరేక శక్తులు కుట్రతో ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తాయి. అభివృద్ధిపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాయి. మనం ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు చేస్తున్న మంచి పనులను గురించి కూడా వివరించాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకుని ప్రజలకు తెలియజేయాలి. ఇబ్బందులను అధిగమిస్తూనే సంక్షేమం, అభివృద్ధి బాటను వీడటం లేదు" అని చంద్ర‌బాబు పేర్కొన్నారు. 

హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు
"అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళుతున్నాం. పోలవరానికి నిధులు, విశాఖ రైల్వే జోన్ మంజూరు, స్టీల్ ప్లాంట్‌కు రూ.11,400 కేంద్రం కేటాయించింది. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఇప్పటికే  మత్య్సకారుల సేవలో, ఎస్సీ వర్గీకరణ, అన్నక్యాంటీన్లు, పింఛన్లు, 3 గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం. వచ్చే నెల రైతులకు అన్నదాత కింద పెట్టుబడి సాయం అందిస్తాం" అని ముఖ్య‌మంత్రి చెప్పారు.

లాజిస్టిక్ హబ్‌గా రాయలసీమ
"రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 42 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుడతాం. 175 నియోజకవర్గాల్లోనూ రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి చేసి 'వన్ ఫ్యామిలీ... వన్ ఎంట్రప్రెన్యూర్' సాకారం దిశగా అడుగులు వేస్తాం. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపడతాం. విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం. రామాయపట్నంలో ఎరైన్-కో, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ దిగ్గజ కంపెనీలు లక్ష కోట్లతో పెట్టుబడులు పెడుతున్నాయి.

మిట్టల్ ప్లాంట్ పూర్తయితే రెండు స్టీల్ ప్లాంట్లు, దేశంలోనే ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేసే జిల్లాగా ఉమ్మడి విశాఖ రికార్డు సృష్టిస్తుంది. రాయలసీమను డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్స్, డ్రోన్, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం. రాయలసీమకు బెంగళూరు, హైదరాబాద్ అనుసంధాన హైవేలు, ఎయిర్ పోర్టులు అందుబాటులో ఉంటాయి. తద్వారా లాజిస్టిక్ హబ్‌గా రాయలసీమ మారుతుంది" అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. 
Chandrababu
Narendra Modi
Amaravati
Andhra Pradesh
Capital City
PM Modi's Visit
TDP
Janasena
BJP
Development

More Telugu News