Shobu Yarlagadda: అక్టోబర్‌లో మళ్లీ థియేటర్లలోకి 'బాహుబలి'.. నిర్మాత శోభు యార్లగడ్డ ప్రకటన

Baahubali to be re released in October say makers as second part of film completes eight years
  • ప్రభాస్ 'బాహుబలి' చిత్రం రీ-రిలీజ్ కు సిద్ధం
  • ఈ అక్టోబర్‌లో భారత్, విదేశాల్లో విడుదల
  • 'బాహుబలి 2' ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకటన
  • నిర్మాత శోభు యార్లగడ్డ ఎక్స్  ద్వారా వెల్లడి
  • అభిమానుల కోసం వేడుకగా రీ-రిలీజ్ ప్లాన్
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన పాన్-ఇండియా చిత్రం 'బాహుబలి'. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రెండో భాగం 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ఓ తీపి కబురు అందించింది. 

బాహుబలి చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా 'బాహుబలి'ని రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.

ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై 'బాహుబలి' చిత్రాన్ని నిర్మించిన శోభు యార్లగడ్డ, 'బాహుబలి 2' ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 28న సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. "ఈ ప్రత్యేకమైన రోజున, ఈ అక్టోబర్‌లో భారతదేశంలో, అంతర్జాతీయంగా 'బాహుబలి'ని రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇది కేవలం రీ-రిలీజ్ మాత్రమే కాదు, మా ప్రియమైన అభిమానుల కోసం ఒక వేడుకల సంవత్సరం అవుతుంది! పాత జ్ఞాపకాలు, కొత్త విశేషాలు, కొన్ని అద్భుతమైన సర్‌ప్రైజ్‌లను ఆశించండి" అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

2017 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'బాహుబలి 2', సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. రూ. 1000 కోట్ల మార్కును దాటిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సైతం గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రాన్ని వెండితెరపై చూసే అవకాశం అభిమానులకు కలగనుంది.
Shobu Yarlagadda
Baahubali
Baahubali 2
SS Rajamouli
Prabhas
Rana Daggubati
Re-release
October Release
Indian Cinema
Pan-India Film

More Telugu News