Chandrababu Naidu: విశాఖకు త్వరలో గూగుల్... సీఎం చంద్రబాబు ప్రకటన

Google Coming to Visakhapatnam CM Chandrababu Naidus Announcement
  • అమరావతిలోని విట్ యూనివర్సిటీలో 'వి లాంచ్‌పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్‌పో
  • హాజరైన సీఎం చంద్రబాబు
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి అని చంద్రబాబు వెల్లడి
  • విశాఖను ఆర్థిక, తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దే ప్రణాళిక
  • రాయలసీమలో స్టీల్ ప్లాంట్, నాలెడ్జ్ హబ్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ రంగాలపై దృష్టి
  • ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు; మేకిన్ ఇండియా కింద హార్డ్‌వేర్ రంగం అభివృద్ధి
అమరావతిలోని విట్ యూనివర్సిటీలో 'వి లాంచ్‌పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్‌పో'లో  సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నూతన భవనాలు ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడారు. 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వివరించారు.

విశాఖపట్నం అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ, నగరానికి కొత్త విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టులను తీసుకువస్తామని చంద్రబాబు అన్నారు. త్వరలోనే టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కూడా విశాఖకు రాబోతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే నగరంలో స్టీల్ ప్లాంట్ ఉందని గుర్తు చేస్తూ, అనకాపల్లిలో ప్రముఖ ఉక్కు సంస్థ ఆర్సెల్లార్ మిట్టల్ సుమారు లక్ష కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిందని తెలిపారు.

రాయలసీమ అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. సీమలోనూ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాయలసీమను డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. భవిష్యత్తు డ్రోన్ టెక్నాలజీదేనని నొక్కిచెప్పిన చంద్రబాబు, ఓర్వకల్లులో ప్రత్యేకంగా డ్రోన్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో అమలవుతున్న 'మేకిన్ ఇండియా' కార్యక్రమం ద్వారా దేశ హార్డ్‌వేర్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఈ రంగం విలువ 130 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉందని, భవిష్యత్తులో 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను తయారుచేసే స్థాయికి భారత్ చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి ఫలాలను రాష్ట్రానికి కూడా అందిస్తామని చంద్రబాబు తెలిపారు.

విట్ విద్యార్థుల ప్రశ్నలు- సీఎం సమాధానాలు

అమరావతిలో అభివృద్ధి పనులు, రాష్ట్రంలో కొత్త  విద్యా సంస్థల ఏర్పాటు, ఐటీ, ఏఐ వినియోగంపై విట్ విద్యార్థులు పలు ప్రశ్నలు అడగ్గా ముఖ్యమంత్రి వాటికి సమాధానం చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంతో పాటు పేదరికం రూపుమాపడం, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం చెప్పారు. ఎన్టీఆర్, అంబేద్కర్, కలామ్ వంటి వారంతా సాధారణ స్థాయి నుంచి వచ్చినవారేనని మహనీయుల స్పూర్తితో యువత తాము ఎంచుకున్న మార్గంలో రాణించాలని అన్నారు. రాజకీయాలను తాను సేవా మార్గంలోనే చూశానని అన్నారు. రాత్రికి రాత్రే జాక్ పాట్ కొట్టేయాలనుకోవడం అత్యాశే అవుతుంది. జీవితంలో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వారికి తిరుగుండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Visakhapatnam
Google
Andhra Pradesh
Economic Development
IT
AI
Investments
Steel Plant
Drone City

More Telugu News