Paka Venkata Satyanarayana: ఏపీ నుంచి రాజ్యసభ కూటమి అభ్యర్థి ఇతడే... ఎవరూ ఊహించని వ్యక్తికి చాన్స్

BJP Nominates Paka Venkata Satyanarayana for Andhra Pradesh Rajya Sabha Seat
  • ఏపీ రాజ్యసభ ఉప ఎన్నిక
  • కూటమి అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ ఎంపిక
  • విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక
  • మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల దాఖలుకు తుది గడువు
  • ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పాకా సత్యనారాయణ 
  • పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నా... అధిష్టానం ఆయన వైపే మొగ్గు
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత పాకా వెంకటసత్యనారాయణ పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్‌ కోటాలో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం విదితమే. ఈ స్థానానికి ఇంకా రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండటంతో అభ్యర్థి ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం యూరప్‌ పర్యటనలో ఉన్నప్పటికీ, ఆమె వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం, పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న పాకా వెంకటసత్యనారాయణ వైపు పార్టీ మొగ్గు చూపినట్లు సమాచారం. అనంతరం, పార్టీ జాతీయ నాయకత్వం ఆయన పేరును ఎన్డీయే అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది.

పాకా సత్యనారాయణకు పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేపథ్యం కలిగిన ఆయన, పార్టీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.  గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం.

వాస్తవానికి, ఈ రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వంటి పలువురి పేర్లు గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలన్నింటినీ పక్కన పెట్టి, పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తున్న రాష్ట్ర నేతకే అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది.

అత్యంత సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో పనిచేసిన పాకా సత్యనారాయణకు అనూహ్యంగా రాజ్యసభ అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. అధిష్ఠానం నిర్ణయం వెలువడిన వెంటనే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Paka Venkata Satyanarayana
BJP
Andhra Pradesh
Rajya Sabha Elections
NDA Candidate
AP BJP
Rajya Sabha
India
Andhra Pradesh Politics
BJP Andhra Pradesh

More Telugu News