Hima Bindu: ఏపీ న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా జడ్జి హిమ బిందు... జీవో జారీ

Hima Bindu Appointed as APSLSA Member Secretary
  • డిప్యుటేషన్ ప్రాతిపదికన సేవలు అందించనున్న జడ్జి హిమ బిందు
  • హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) సూచనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు
  • గతంలో చంద్రబాబును రిమాండ్ కు పంపింది ఈ న్యాయమూర్తే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ (APSLSA) సభ్య కార్యదర్శి (మెంబర్ సెక్రటరీ) గా బి. సత్య వెంకట హిమ బిందును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె విజయవాడలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా, మూడవ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) అందించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిప్యుటేషన్ ప్రాతిపదికన శ్రీమతి హిమ బిందు సేవలను APSLSA కు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ గౌరవ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కు ఆమె సేవలను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

శ్రీమతి హిమ బిందు APSLSA సభ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఈ నియామకానికి సంబంధించి తదుపరి అవసరమైన చర్యలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తీసుకుంటారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు మీదుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇదిలా ఉండగా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు నాయుడును రాజమహేంద్రవరం జైలుకు రిమాండ్‌కు పంపింది ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సత్యవెంకట హిమబిందు కావడం గమనార్హం. 

ఈ క్రమంలో ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (APSLSA) సభ్య కార్యదర్శిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Hima Bindu
APSLSA
Andhra Pradesh
Member Secretary
Judicial Appointment
High Court Registrar
Government Order
Special Court Judge
ACB
Skill Development Corporation

More Telugu News