Indian Army: భారత్ సైనిక కీలక, రహస్య పత్రాలు లీక్ అయ్యాయంటూ ప్రచారం.. స్పందించిన కేంద్రం

Indian Army Key Documents Leak Hoax Debunked by Government
  • పాక్ అనుకూల సోషల్ మీడియా ఖాతాల ద్వారా వ్యాప్తి
  • తీవ్రంగా ఖండించిన కేంద్ర ప్రభుత్వం
  • సైనిక ఆధునికీకరణకు విరాళాల సేకరణ కూడా అబద్ధమన్న కేంద్రం
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిస్థితులను ఆసరాగా చేసుకుని భారత సైన్యానికి సంబంధించి తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. సైనిక సంసిద్ధతకు చెందిన రహస్య పత్రాలు బయటకు వచ్చాయంటూ పాకిస్థాన్ సోషల్ మీడియా అనుకూల ఖాతాల నుంచి జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా సైన్యం ఆధునికీకరణ కోసం ప్రభుత్వం విరాళాలు సేకరిస్తోందన్న వార్త కూడా పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది.

భారత సైనిక సంసిద్ధతకు సంబంధించిన కీలకమైన, రహస్య పత్రాలు లీక్ అయ్యాయంటూ కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లుగా కేంద్రం గుర్తించింది. ముఖ్యంగా పాకిస్థాన్ అనుకూల హ్యాండిల్స్ నుంచి ఈ పోస్టులు వస్తున్నట్లు గుర్తించింది. అయితే ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, వైరల్ అవుతున్న పత్రాలు పూర్తిగా నకిలీవని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం 'ఎక్స్' వేదికగా స్పష్టం చేసింది.

"సంబంధిత పత్రాలు నకిలీవి. అధికారికంగా ధృవీకరించని వివరాలను ఎవరూ షేర్‌ చేయొద్దు. కచ్చితమైన సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోండి" అని పీఐబీ తన పోస్ట్‌లో పేర్కొంది.

విరాళాల సేకరణ ప్రచారం కూడా అబద్ధమే

ఇదే తరహాలో సైన్యం ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం విరాళాలు సేకరిస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా కూడా తెరిచిందంటూ అంతకుముందు మరో నకిలీ సందేశం చక్కర్లు కొట్టింది. ఈ ప్రచారాన్ని కూడా రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. సైన్యం కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ప్రభుత్వం అటువంటి బ్యాంకు ఖాతా ఏదీ తెరవలేదని స్పష్టం చేసింది. వాట్సాప్‌లో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించింది.
Indian Army
Fake News
Social Media Hoax
PIB Fact Check
Defense Ministry
Pakistan Propaganda
Leaked Documents
Military Documents
Donation Campaign
Army Modernization

More Telugu News