Indian Student: కెన‌డాలో భార‌తీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Indian Student Vanshika Found Dead in Canada
  • కెనడాలో భారతీయ విద్యార్థిని వంశిక అనుమానాస్పద మృతి
  • 4 రోజుల క్రితం త‌న నివాసం నుంచి బ‌య‌ట‌కు వెళ్లి.. బీచ్‌లో శ‌వ‌మై క‌నిపించిన వైనం
  • ఆమె మృతిని ధ్రువీకరించిన ఒట్టావాలోని భారత హైకమిషన్
కెనడాలో భారతీయ విద్యార్థిని వంశిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం త‌న నివాసం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన ఆమె బీచ్‌లో శ‌వ‌మై క‌నిపించింది. ఆమె మృతిని ఒట్టావాలోని భారత హైకమిషన్ ధ్ర‌వీకరించింది. ఈ మేర‌కు భార‌త హైక‌మిష‌న్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు చేసింది. 

"ఒట్టావాలో భారత్‌కు చెందిన‌ వంశిక అనే విద్యార్థిని మరణించిన వార్త మాకు చాలా బాధ కలిగించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆమె మృతికి గ‌త కార‌ణాన్ని తెలుసుకోవ‌డానికి దర్యాప్తు చేస్తున్న‌ట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సాధ్యమైనంత సహాయం అందించడానికి మేము మృతురాలి కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్థానిక భార‌తీయ సమాజ సంఘాలతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాం" అని ఒట్టావాలోని భారత హైకమిషన్ పేర్కొంది.

పంజాబ్‌లోని డేరా బస్సీకి చెందిన వంశిక డిప్లొమా కోర్సు కోసం రెండున్నర సంవత్సరాల క్రితం ఒట్టావాకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఒట్టావాలోని హిందూ కమ్యూనిటీ ఒట్టావా పోలీసుల‌కు రాసిన లేఖ ప్రకారం... వంశిక ఏప్రిల్ 25న తన నివాసం నుంచి బ‌య‌ట‌కు వెళ్లింది. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయిందని తెలుస్తోంది. వంశిక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడం కుటుంబ స‌భ్యులను ఆందోళ‌న‌కు గురిచేసింది. ఈ క్ర‌మంలో ఆమె ఒక ముఖ్యమైన పరీక్షకు కూడా హాజరు కాలేదు.

"వంశిక శుక్రవారం (ఏప్రిల్ 25) సాయంత్రం 8-9 గంటల ప్రాంతంలో 7 మెజెస్టిక్ డ్రైవ్‌లోని తన నివాసం నుంచి అద్దె గది కోసం బయట‌కు వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆ రాత్రి దాదాపు 11:40 గంటలకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ మరుసటి రోజు ఆమె ఒక ముఖ్యమైన పరీక్ష ఉన్నా దానికి హాజరు కాలేదు. ఆమెను ఫోన్ ద్వారా సంప్ర‌దించ‌డానికి కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ఎంత‌ ప్రయత్నించినప్పటికీ సాధ్య‌ప‌డ‌లేదు. ఆమె ఆచూకీ గురించి ఎటువంటి సమాచారం లేదు" అని అక్క‌డి హిందూ కమ్యూనిటీ త‌న లేఖలో పేర్కొంది.

ఈ మేర‌కు ఒట్టావా పోలీస్ సర్వీస్‌ను ఆమె ఆచూకీ తెలుసుకోవాలని కోరుతూ, క‌మ్యూనిటీ వారు ఫిర్యాదు చేశారు. "మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం. నిజం చెప్పాలంటే చాలా భయపడుతున్నాం. ఒట్టావాలోని హిందూ సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ ఆందోళన ప్రతి గంట గడిచేకొద్దీ పెరుగుతూనే ఉంది. వంశిక ఆచూకీ కోసం మీరు వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని అభ్యర్థిస్తున్నాం. ఆమె అదృశ్యంపై వేగ‌వంతంగా దర్యాప్తు చేయాలని ఒట్టావా పోలీస్ సర్వీస్‌ను మేము కోరుతున్నాం అని హిందూ సంఘం తెలిపింది. కాగా, మీడియా నివేదికల ప్రకారం వంశిక మృతదేహం ఒట్టావా బీచ్‌లో దొరికింది. 


Indian Student
Vanshika
Canada
Ottawa
Suspicious Death
Beach
Missing Person
Hindu Community
India
Diploma Course

More Telugu News