Sedentary Lifestyle: రోజంతా కూర్చునే పనిచేస్తున్నారా.. గుండెకు ముప్పు తప్పదు జాగ్రత్త!

Prolonged Sitting Health Risks and Easy Exercises
  • గంటలతరబడి కూర్చోవడం వల్ల పొగతాగే అలవాటు కన్నా ఎక్కువ ముప్పు.. హెచ్చరిస్తున్న నిపుణులు
  • కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు పెరిగే అవకాశం ఉందని వార్నింగ్
  • నిలబడటం మాత్రమే పరిష్కారం కాదని, శరీర కదలిక ముఖ్యమని వెల్లడి
  • రోజుకు 30 నిమిషాల వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండొచ్చని సూచన
పొగతాగే అలవాటు ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే.. రోజంతా ఆఫీసులోనో ఇంట్లోనో ఒకేచోట కదలకుండా కూర్చుని ఉండడం కూడా అంతే హానికరమని, కొన్నిసార్లు మరింత ఎక్కువ హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం డెస్క్ వద్ద నిలబడి పనిచేయడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభించదని ఎన్‌వైయూ లాంగోన్‌కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ విలియమ్స్ స్పష్టం చేస్తున్నారు.

రోజంతా నిలబడి ఉండటం వల్ల చురుగ్గా ఉన్నామని కొందరు భావిస్తారని, కానీ అది సరైన శారీరక శ్రమ కిందకు రాదని డాక్టర్ విలియమ్స్ తెలిపారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కదలిక అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కాళ్లు బలహీనపడటం, బరువు పెరగడం, గుండె జబ్బులు, వెన్నునొప్పి, భుజాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు వివరిస్తున్నారు. మానసిక ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా, ఊపిరితిత్తులు, గర్భాశయ, పెద్దప్రేగు క్యాన్సర్ల వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా ఇది పెంచుతుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఈ ప్రమాదాల నుంచి బయటపడటానికి రోజువారీ జీవితంలో శారీరక శ్రమను భాగం చేసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ విలియమ్స్ సూచిస్తున్నారు. ఇందుకోసం గంటల తరబడి జిమ్‌ లో కసరత్తులు చేయాల్సిన అవసరం లేదని, రోజుకు కనీసం 30 నిమిషాల పాటు, వీలైతే 10-15 నిమిషాల చొప్పున, గుండె వేగాన్ని పెంచే వ్యాయామాలు చేయడం మంచిదని చెప్పారు. లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం, రోజులో ఒక మీటింగ్‌ను నడుస్తూ చేయడం, ఒక కాలు ముందుకు వేసి మోకాలిని వంచే వ్యాయామం చేయడం, పార్కింగ్ స్థలంలో వాహనాన్ని కొంచెం దూరంగా నిలపడం, టీవీ చూస్తున్నప్పుడు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వంటివి దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Sedentary Lifestyle
Heart Disease
Health Risks
Physical Activity
Exercise
Dr. Stephen Williams
Cancer Risk
Back Pain
Weight Gain
Office Work

More Telugu News