Anitha Vangalapoodi: గోడ కూలుతుందని ఎవరూ అనుకోలేదు... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత

Simhachalam Temple Wall Collapse 7 Devotees Dead Minister Anitha Announces Strict Action
  • సింహాచలం ఆలయం వద్ద గోడకూలి ఏడుగురి మృతి
  • తాము దర్శనం చేసుకుని వచ్చాక గోడ కూలిన ప్రమాదం గురించి తెలిసిందన్న అనిత
  • అర్ధరాత్రి వర్షం పడుతున్న సమయంలో కూడా తాము ఇక్కడే ఉన్నామని వెల్లడి
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు మృతుల కుటుంబాలకు భారీ పరిహారాన్ని ప్రకటించారు.

సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ దురదృష్టకర సంఘటనలో ఏడుగురు మరణించారని, వారిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని ఆమె తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

చందనోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని ముందుగానే అంచనా వేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని, తాను కూడా రెండు రోజుల క్రితం ఏర్పాట్లను పరిశీలించానని అనిత చెప్పారు. "ఇది ఊహించని ఘటన. గోడ కూలుతుందని ఎవరూ ఊహించలేరు. అర్ధరాత్రి వర్షం పడుతున్న సమయంలో మేం కూడా ఇక్కడే ఉన్నాం, దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ప్రమాదం గురించి తెలిసింది. వెంటనే ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాం. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగలేదు" అని తెలిపారు.

గోడ కూలిన ఘటనకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి స్పష్టం చేశారు. కూలిన గోడ నిర్మాణం ఎప్పుడు జరిగింది? కాంట్రాక్టర్ ఎవరు? నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు ఉంటుందన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింహాచలం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. గోడ కూలిన ఘటనపై లోతైన విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా, బాధితుల కుటుంబాల్లో అర్హులైన వారికి దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగావకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 
Anitha Vangalapoodi
Simhachalam Temple
Wall Collapse
Andhra Pradesh
Chandanotsavam
Temple Tragedy
Nara Chandrababu Naidu
Home Minister
Seven Devotees Died
Compensation

More Telugu News