Lakshmi Parvati: చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన లక్ష్మీపార్వతి

Lakshmi Parvati Criticises Chandrababu Naidu Again
  • దేవుడి పేరుతో అన్యాయాలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపాటు
  • సింహాచలం ఘటన బాధాకరమని వ్యాఖ్య
  • బాధితులకు కోటి చెప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్
సింహాచలం దేవస్థానంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని, దేవుడి పేరుతో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొందరి పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయనిపిస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటి అపశృతులు, బాధాకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు తనను తాను నాస్తికుడిగా గతంలోనే చెప్పారని తెలిపారు. 2014లో చంద్రబాబు హయాంలోనే 40 ఆలయాలను కూల్చివేశారని, అయినా బీజేపీ ఆయనను సమర్థించడం విడ్డూరంగా ఉందని ఆమె విమర్శించారు.

గతంలో జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాట, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, గోవుల మృతి వంటి ఘటనలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జరిగాయని లక్ష్మీపార్వతి అన్నారు. ఎవరు ఎలా పోయినా ఫర్వాలేదు, తమ దోపిడీ తమకు ముఖ్యం అన్నట్లుగా ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఉంది అని ఆమె విమర్శించారు. సింహాచలం ఘటనకు సంబంధించి గోడ నిర్మాణంపై ప్రశ్నిస్తూ, "మూడు రోజుల క్రితం గోడ కట్టడమేంటి? ముందే ఎందుకు నిర్మించలేదు? అవినీతిపరులకు పనులు అప్పగించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి" అని ఆమె ఆరోపించారు.

అర్హత లేని వ్యక్తులు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయని లక్ష్మీపార్వతి అన్నారు. సింహాచలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుమలలో గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై చేపట్టిన విచారణ ఏమైందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Lakshmi Parvati
Chandrababu Naidu
Simhachalam Temple Incident
Andhra Pradesh Politics
YCP
TDP
Temple Tragedy
Corruption Allegations
Political Criticism
AP News

More Telugu News