CPI Narayana: హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు... స్త్రీ జన్మను అపవిత్రం చేయొద్దన్న సీపీఐ నారాయణ

CPI Narayana Condemns Miss World in Hyderabad
  • హైదరాబాద్‌లో అందాల పోటీల నిర్వహణపై నారాయణ మండిపాటు
  • స్త్రీ జాతిని అవమానిస్తున్నారని ఆగ్రహం
  • మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని ప్రభుత్వానికి సూచన
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించనుండటంపై సీపీఐ నేత నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతి జిల్లా గూడూరులో తన మేనకోడలికి చెందిన ఓ వాణిజ్య సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ విషయంపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ద్వారా పవిత్రమైన స్త్రీ జాతిని అవమానిస్తున్నారని నారాయణ ఆరోపించారు. "అందాల పోటీ అంటే స్త్రీలను నడిరోడ్డు మీద వేలం వేయడం కాదా? ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి పోటీలు నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు" అని ఆయన తీవ్రంగా విమర్శించారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు.

ప్రభుత్వాలు మహిళలను స్వయం శక్తితో జీవించేలా ప్రోత్సహించాలని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నారాయణ సూచించారు. అందాల పోటీల పేరుతో స్త్రీల గౌరవాన్ని కించపరచడం సరికాదని, ఈ పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. తన మేనకోడలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి, పది మందికి ఉపాధి కల్పించేందుకు సొంత వ్యాపారం ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు. మహిళలు ఇలా స్వయం ఉపాధి వైపు రావడాన్ని ప్రోత్సహించాలే తప్ప, అందాల పోటీలతో వారిని అపవిత్రం చేయకూడదని నారాయణ హితవు పలికారు. తన మేనకోడలు అందాల పోటీలో పాల్గొంటే ఫస్ట్ వస్తుందని... కానీ, అది తప్పు అని అన్నారు.
CPI Narayana
Miss World
Hyderabad
Telangana Government
Revanth Reddy
Beauty Pageant
Women Empowerment
Gender Equality
India
Criticism

More Telugu News