Bolisetti Srinivas: నేను చనిపోవాలని నాతో పాటు ఉంటున్న కొందరు నాయకులు కోరుకుంటున్నారు: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు

Janasena MLA Bolisettis Shocking Claim Some Leaders Want Me Dead
  • నేను పోతే ఉపఎన్నిక వస్తుందని ఆశపడుతున్నారని బొలిశెట్టి మండిపాటు
  • కూటమిలోని మూడు పార్టీలు ఇచ్చిన మ్యాండేట్ తోనే తాను గెలిచానని వ్యాఖ్య
  • టీడీపీలో తాను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదన్న జనసేన ఎమ్మెల్యే
జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటే ఉంటున్న కొందరు నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"నేను పోతే ఉప ఎన్నిక వస్తుంది, ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని కొందరు ఆశపడుతున్నారు" అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు. తన గెలుపు వెనుక ఎవరి త్యాగాలు లేవని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ఇచ్చిన మ్యాండేట్ తోనే తాను గెలిచానని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని, ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ఆధారపడలేదని తేల్చి చెప్పారు.

నియోజకవర్గంలో అధికారులను ఇబ్బంది పెట్టినా, బెదిరించినా సహించేది లేదని బొలిశెట్టి హెచ్చరించారు. అలాంటి వారి నుంచి అధికారులను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. "నేను పోయాకే మీరు ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను" అంటూ తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

తాను ఎలాంటి స్థలాలు, పొలాలు కబ్జా చేయలేదని, కేవలం తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నానని బొలిశెట్టి కుండబద్దలు కొట్టారు. తాను తెలుగుదేశం పార్టీలోని ఏ ఒక్క కార్యకర్తను ఇబ్బంది పెట్టలేదని, అయితే శాసనసభ్యుడిగా తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూటమిలోని మిత్రపక్ష నాయకులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బొలిశెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 
Bolisetti Srinivas
Janasena MLA
Tadepaaligudem
Andhra Pradesh Politics
West Godavari District
Controversial Remarks
Political Conspiracy
Byelection
Telugu Desam Party
BJP

More Telugu News