Madhavaram Krishna Rao: బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం... రాసిపెట్టుకోండి: మాధవరం కృష్ణారావు

BRSs Landslide Victory Predicted by Madhavaram Krishna Rao
  • వరంగల్‌ బీఆర్ఎస్ రజతోత్సవ సభ సూపర్ సక్సెస్ అయిందన్న మాధవరం కృష్ణారావు
  • సభ విజయంతో కాంగ్రెస్ నేతల్లో భయం మొదలైందని వ్యాఖ్య
  • హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శ
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని, ఈ విషయాన్ని రాసిపెట్టుకోవాలని కూకట్‌పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. వరంగల్‌లో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో భయం పట్టుకుందని ఆయన అన్నారు. కూకట్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారని, దేశంలోనే ఇటువంటి భారీ సభ జరగలేదని కృష్ణారావు అన్నారు. ఈ సభ విజయాన్ని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు వస్తున్న వేలాది వాహనాలను అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పథకం ప్రకారం అడ్డుకున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తులం బంగారం, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని కృష్ణారావు జోస్యం చెప్పారు.
Madhavaram Krishna Rao
BRS
Telangana Elections
Congress Party
KCR
Warangal
Political News
Telangana Politics
Election Predictions
India Politics

More Telugu News