Giovanni Stanovo: సమీప భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందా?

Will Gold Prices Rise Further in the Near Future
  • సోమవారం బంగారం ధరలు 1 శాతానికి పైగా పతనం
  • డాలర్ బలపడటం, వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలు
  • ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో భవిష్యత్తులో ధర పుంజుకునే అవకాశం ఉందంటున్న నిపుణులు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సోమవారం ఒత్తిడికి గురయ్యాయి. డాలర్ బలపడటం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పడతాయన్న అంచనాలు పసిడి పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై మదుపరుల ఆసక్తి తాత్కాలికంగా తగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో 3,500 డాలర్లను తాకిన పసిడి 3,300 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది.

తాజా ట్రేడింగ్ సరళిని గమనిస్తే స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 0.9 శాతం క్షీణించి $3,289.97 వద్దకు చేరింది. అదేవిధంగా, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1 శాతం తగ్గి ఔన్సుకు 3,301 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. ప్రధాన కరెన్సీలతో డాలర్ విలువను సూచించే డాలర్ ఇండెక్స్ 0.3 శాతం పెరగడం గమనార్హం. 

"ప్రస్తుతం మార్కెట్‌లో వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే సానుకూల దృక్పథం కనిపిస్తోంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై ఆందోళనలు కూడా తగ్గాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనాలకు డిమాండ్ ప్రస్తుతానికి తగ్గింది" అని యూబీఎస్ విశ్లేషకుడు గియోవన్నీ స్టానోవో తెలిపారు. "అయితే, ఈ ఏడాది చివరలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. అందువల్ల, భవిష్యత్తులో బంగారం ధర తిరిగి ఔన్సుకు $3,500 మార్కును తాకే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము" అని ఆయన అంచనా వేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాతో సుంకాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. గత వారం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధ తీవ్రతను తగ్గించేందుకు సానుకూలంగా ఉన్నామని అమెరికా సంకేతాలిచ్చింది. ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలను పెంచింది. అయితే, చైనా కొన్ని అమెరికా దిగుమతులపై సుంకాలను మినహాయించినప్పటికీ, ట్రంప్ చెప్పినట్లుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న వాదనను శుక్రవారం ఖండించింది.

సాధారణంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయాల్లో మదుపరులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఆశ్రయిస్తారు. వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, పెట్టుబడిదారుల నుంచి గట్టి డిమాండ్ వంటి కారణాలతో గత వారం పసిడి ధర ఔన్సుకు 3,500 డాలర్ల వద్ద జీవనకాల గరిష్ట స్థాయికి చేరింది.
Giovanni Stanovo
Gold Price
Gold Market
US-China Trade War
Federal Reserve
Interest Rates
Gold Investment
Dollar Index
Commodity Prices
Inflation

More Telugu News