Supreme Court: ఓబులాపురం మైనింగ్ కేసు .. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

Supreme Courts Key Remarks on Obulapuram Mining Case
  • మైనింగ్ ఆపేస్తే ఆకాశం ఊడిపడదు.. అది పర్యావరణానికి మేలేనన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా 
  • ఈ కేసును పూర్తి స్థాయిలో వినాల్సి ఉందని వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • మహాబలేశ్వరప్ప కంపెనీ అభ్యర్ధనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేసినంత మాత్రాన ఆకాశం ఏమీ కూలిపోదని, దానివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్. ఓకా వ్యాఖ్యానించారు. ఓబుళాపురం మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు 2010లో స్టే విధించింది. అనంతరం విచారణలో అంతర్రాష్ట్ర సరిహద్దులు, మైనింగ్ లీజుల హద్దులను నిర్ధారించాలని కేంద్ర సాధికార సంస్థ, సర్వే ఆఫ్ ఇండియాలను ఆదేశించింది.

అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు పరిష్కారమైనందున ఈ ప్రాంతంలో మైనింగ్‌కు అనుమతిస్తే తమకు అభ్యంతరం లేదని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. అయితే, అప్పటి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ అమైకస్‌క్యూరీ అఫిడవిట్ దాఖలు చేస్తూ, ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఏకపక్షంగా గనుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వకుండా, ఏవైనా ఆదేశాలు జారీ చేసే ముందు అన్ని పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత నుంచి కేసు విచారణ వాయిదా పడుతూ వస్తోంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌తో విభేదిస్తూ, వివాదాస్పద గనుల్లో మైనింగ్‌కు అవకాశం ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో వాటి హద్దులను నిర్ధారించిన తర్వాతనే ముందుకు వెళ్లే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ గత జనవరి నెలలో అఫిడవిట్ దాఖలు చేసింది. బుధవారం విచారణ సమయంలో ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది తమ అభ్యంతరాలను వివరించారు.

దీంతో న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్. ఓకా జోక్యం చేసుకుంటూ, ఈ కేసును తాము పూర్తి స్థాయిలో వినాల్సి ఉందని పేర్కొంటూ వాయిదా వేశారు. ఈ సమయంలో మహాబలేశ్వరప్ప కంపెనీ తరపున సీనియర్ న్యాయవాది బసవప్రభు జోక్యం చేసుకుంటూ తమ మైనింగ్ లీజు గడువు ముగియనుందని, దానిని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ తవ్వకాలు ఆపినంత మాత్రాన ఆకాశం కూలిపోదని, అది పర్యావరణానికి మేలు చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. 
Supreme Court
Obulapuram Mining Case
Justice Abhay S Oka
Andhra Pradesh Government
Mining Lease
Inter-state Boundaries
Mahaleshwarappa Company
YCP Government

More Telugu News