Topudurthi Prakash Reddy: అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే... గాలిస్తున్న పోలీసులు

Former Raptadu YSRCP MLA Thopudurthi Absconding After Case Filed
  • జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటన సందర్భంగా నమోదైన కేసు
  • బెయిల్ వచ్చేంత వరకు తోపుదుర్తి కనిపించకుండా ఉండే అవకాశం
  • ఇంటికి పోలీసులు వెళ్లినా లభించని ఆచూకీ
వైసీపీ రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి నమోదైన కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఈ కేసు విచారణ నిమిత్తం సత్యసాయి జిల్లా రాప్తాడులోని ప్రకాష్ రెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఆయన ఇంట్లో అందుబాటులో లేరు. ఆయన ఎక్కడికి వెళ్లారనే విషయంపై కుటుంబసభ్యులను ఆరా తీయగా, తమకు తెలియదని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా, ప్రకాష్ రెడ్డి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

నమోదైన కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడంతో పాటు, ముందస్తు బెయిల్ పొందేందుకే ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బెయిల్ లభించే వరకు ఆయన బయటకు వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇదే కేసుకు సంబంధించి హెలికాప్టర్ పైలట్ అనిల్ కుమార్‌కు పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. రేపు రామగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే, అనిల్ కుమార్ ప్రత్యక్షంగా విచారణకు హాజరవుతారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని అనిల్ కుమార్ తరపు న్యాయవాదులు పోలీసులను కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Topudurthi Prakash Reddy
YCP
Raptadu MLA
Andhra Pradesh Politics
Police Investigation
Missing Politician
Arrest Warrant
Anil Kumar
Helicopter Pilot
YS Jagan Mohan Reddy

More Telugu News