Hania Amir: నటి హానియా ఆమిర్ సహా పలువురు పాక్ నటుల ఇన్‌స్టా ఖాతాలను బ్లాక్ చేసిన భారత్

India Blocks Pakistani Actors Instagram Accounts Amidst Rising Tensions
  • పహల్గామ్ దాడి తర్వాత పాక్‌పై పలు చర్యలు తీసుకుంటున్న భారత్
  • ఇప్పటికే పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లపై నిషేధం
  • తాజాగా పలువురు సెలబ్రిటీల ఖాతాలు బ్లాక్
  • కొందరు పాప్యులర్ నటుల ఖాతాలు మాత్రం ఇంకా యాక్టివ్‌గానే..
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ దాడి వెనుక పాక్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) అనుబంధ గ్రూప్ అయిన 'ది రెసిస్టెన్స్ ఫోర్స్' (టీఆర్ఎఫ్) ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను భారత ప్రభుత్వం నిలిపివేసింది. ఈ జాబితాలో అలీ జాఫర్, సనం సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్రా అజీజ్, ఇమ్రాన్ అబ్బాస్, సజల్ అలీ ఉన్నారు.

భారత్‌లోని వీరి అభిమానులు ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించగా “భారతదేశంలో ఈ ఖాతా అందుబాటులో లేదు. మేము చట్టపరమైన అభ్యర్థనకు అనుగుణంగా ఈ కంటెంట్‌ను పరిమితం చేశాం” అనే సందేశం కనిపిస్తోంది. హనియా ఆమిర్, మహీరాఖాన్ లాంటి ఇతర పాకిస్థానీ నటీనటుల ఖాతాలు కూడా భారత్‌లో నిలిచిపోయాయి. వీరిలో హనియా ఆమిర్ ఖాతా మొదటిగా నిలిచిపోయింది. అయితే, ఫవాద్ ఖాన్, వహాజ్ అలీ లాంటి పాప్యులర్ నటుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు మాత్రం ఇప్పటికీ భారత్‌లో కనిపిస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలే కాదు, 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానళ్లను కూడా భారత్ నిషేధించింది. ఇవి దేశం, సైన్యం, భద్రతా సంస్థలపై తప్పుడు ప్రచారాలు, సున్నిత విషయాలపై రెచ్చగొట్టే విషయాలను ప్రసారం చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ నిర్వహించిన, 3.5 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్‌‌ను కూడా భారత్ నిషేధించింది.

ఏప్రిల్ 22 దాడికి ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ఉద్యోగుల సంఖ్య తగ్గించింది. ఢిల్లీలోని పాకిస్థానీ హైకమిషన్‌లోనూ ఉద్యోగులను తగ్గించింది. పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని భావిస్తున్న పాక్ అప్రమత్తంగా ఉంది.
Hania Amir
Pakistan Actors
India Bans Instagram Accounts
Indo-Pak Tension
Jammu and Kashmir Terrorist Attack
YouTube Channels Banned
Shoaib Akhtar
Bilal Abbas
Sanam Saeed
India Pakistan Relations

More Telugu News