Jagan Mohan Reddy: రేపే అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం... జగన్ ఇంటికి వెళ్లి ఆహ్వానించిన కూటమి ప్రభుత్వం

Amaravati Development Restart Jagan Invited by AP Govt
  • ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులకు శ్రీకారం
  • ప్రొటోకాల్ ప్రకారం జగన్ కు ఆహ్వానం
  • గతంలో అమరావతి శంకుస్థాపనకు హాజరుకాని జగన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. రేపు జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ప్రభుత్వ ప్రొటోకాల్ అధికారులు నిన్న సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో జగన్ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో, ఆయన పీఏ కె. నాగేశ్వరరెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.

గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ జగన్ హాజరు కాలేదు. అంతేకాకుండా, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని ప్రకటించిన విషయం విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలో, తాజా ఆహ్వానంపై జగన్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాగా, ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నారాయణ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పాల్గొనే సభ, ఇతర కార్యక్రమాల కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. 
Jagan Mohan Reddy
Amaravati
Andhra Pradesh
Narendra Modi
Three Capitals
Capital City
AP Government
State Development
Political News
India Politics

More Telugu News