Pahalgham Attack: పహల్గామ్ దాడికి రెండు రోజుల ముందు బైసరన్‌లో ఉగ్రవాదులు.. కీలక విషయాలు వెలుగులోకి!

Pahalgham Attack Terrorists Spotted in Bytesaran Two Days Before
  • ఏప్రిల్ 15న పహల్గామ్ చేరుకున్న ఉగ్రవాదులు
  • దాడి కోసం నాలుగు ప్రాంతాల్లో రెక్కీ
  • ఆయా ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో వెనుదిరిగిన ఉగ్రవాదులు
  • ఉగ్రవాదులకు సాయం చేసిన ఓజీడబ్ల్యూలు
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించి అరెస్ట్ అయిన ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్ (ఓజీడబ్ల్యూ) విచారణలో వెల్లడించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 22 దాడికి రెండు రోజుల ముందు బైసరన్ లోయలో ఉగ్రవాదులు కనిపించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు ఏప్రిల్ 15న పహల్గామ్‌కు చేరుకున్నారు. మొత్తం నాలుగు ప్రదేశాల్లో రికానసెన్స్ (గమనింపు, లక్ష్య నిర్ధారణ) చేపట్టారు. వీటిలో బైసరన్ లోయతోపాటు అరూ వ్యాలీ, స్థానిక అమ్యూజిమెంట్ పార్క్, బీటాబ్ వ్యాలీ ఉన్నాయి. అయితే, ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో వారు దాడికి వెనుకంజ వేశారని సమాచారం.

ఉగ్రవాదులకు సహకరించిన ఓజీడబ్ల్యూలు 
ఉగ్రవాదులకు భౌగోళిక సహాయం చేసిన 20 మంది ఓజీడబ్ల్యూలను ఎన్ఐఏ గుర్తించింది. వీరిలో పలువురిని అరెస్ట్ చేయగా, మిగిలినవారు నిఘా నీడలో ఉన్నారు. వీరిలో నలుగురు ఓజీడబ్ల్యూలు ఉగ్రవాదులకు రీకానసెన్స్, లాజిస్టిక్‌ సాయం చేసినట్టు ఆధారాలు లభించాయి. అలాగే, దాడికి ముందు శాటిలైట్ ఫోన్ల వినియోగంపైనా ఆధారాలు లభించాయి. మొత్తం మూడు శాటిలైట్ ఫోన్లు ఉపయోగించినట్టు గుర్తించగా, వాటిలో రెండు ఫోన్ల సిగ్నల్స్ ట్రేస్ చేయడంలో భద్రతాధికారులు విజయవంతమయ్యారు.

దాడిపై భారీ స్థాయిలో దర్యాప్తు  
పహల్గామ్ దాడికి సంబంధించి ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇప్పటికే 2,500 మందికిపైగా విచారించాయి. 186 మంది నిందితులు ఇప్పటికే కస్టడీలో ఉన్నారు. దర్యాప్తు ఎంత విస్తృతంగా సాగుతుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. ఇక, దాడి అనంతరం జమ్మూకశ్మీర్ అంతటా కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరంగా జరిగాయి. నిషేధిత సంస్థలైన హురియత్ కాన్ఫరెన్స్, జమాతే ఇస్లామీకి అనుబంధంగా ఉన్న అనేక మంది నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కుప్వారా, హంద్వారా, అనంతనాగ్, త్రాల్, పుల్వామా, సోపోర్, బారాముల్లా, బందిపోరా లాంటి ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.

ఎన్ఐఏ వర్గాల ప్రకారం.. నిషేధిత సంస్థలుగా ఉన్నప్పటికీ ఈ గ్రూపులు పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు మద్దతుగా ఉన్న ఓజీడబ్ల్యూ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించాయి. ఇప్పటికే ఈ సంస్థలకు చెందిన అనేక మంది సభ్యుల కాల్ రికార్డులు పరిశీలనలో ఉన్నాయి. ఓజీడబ్ల్యూలతో ఉన్న సంభాషణల ఆధారంగా పహల్గామ్ దాడిలో భాగస్వామ్యంపై కీలక ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు.
Pahalgham Attack
NIA Investigation
Jammu and Kashmir Terrorism
Over Ground Workers
Terrorist Activities
Satellite Phones
Reconnaissance
Bytesaran Valley
Hurriyat Conference
Jamaat-e-Islami

More Telugu News