Chandrababu Naidu: అమరావతి రైతులను కోటీశ్వరులను చేస్తున్నాం: చంద్రబాబు

Chandrababu Naidu Making Amaravati Farmers Crorepatis
  • ఆత్మకూరు నుంచి 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం
  • కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య
  • అమరావతిలో భూముల విలువ పెరిగిందన్న చంద్రబాబు
మేడే సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించి, రాష్ట్రంలోని కార్మికులు, అభివృద్ధి ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యధికంగా అసంఘటిత కార్మికులే ఉన్నారని, గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో వారు అనేక కష్టనష్టాలకు గురయ్యారని అన్నారు.

ఇసుక ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ ఆదాయాన్ని వదులుకుని ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి తోడుగా నాలా చట్టాన్ని కూడా రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆరోగ్య అవసరాల కోసం కర్నూలు, గుంటూరులలో వంద పడకల సామర్థ్యంతో ప్రత్యేక ఆసుత్రులను నిర్మిస్తున్నామని వివరించారు.

రాజధాని అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేశారు. ఆ భూములను అభివృద్ధి చేసి, కొంత భాగాన్ని తిరిగి రైతులకే ఇవ్వడం ద్వారా వారిని కోటీశ్వరులను చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో భూముల విలువ గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, మొత్తం 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులను నెలకొల్పుతామని చంద్రబాబు ప్రకటించారు. అయితే, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని ఆయన పరోక్షంగా వైసీపీని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. 
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
MSME Parks
Farmers
Land Acquisition
Development
Employment
YSRCP
Free Sand

More Telugu News