Vaibhav Suryavanshi: తొలి ఓవర్ లోనే వైభవ్ సూర్యవంశి డకౌట్

Vaibhav Suryavanshis Duck Out in First Over
  • ఐపీఎల్ లో రాజస్థాన్ వర్సెస్ ముంబయి
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • 20 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేసిన ముంబయి
  • ఛేదనలో 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ముంబై బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సమాధానం చెప్పలేక, కేవలం 76 పరుగులకు 7 కీలక వికెట్లను చేజార్చుకుని తీవ్రమైన కష్టాల్లో పడింది.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాజస్థాన్ వికెట్ల పతనం కొనసాగింది. తొలి ఓవర్‌లోనే చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశి (0) పరుగులేమీ చేయకుండా దీపక్ చాహర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6 బంతుల్లో 13; 2 ఫోర్లు) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కాసేపటికే నితీశ్ రాణా (11 బంతుల్లో 9; 2 ఫోర్లు) కూడా బౌల్ట్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

కెప్టెన్‌ రియాన్ పరాగ్ (8 బంతుల్లో 16; 3 ఫోర్లు) కొన్ని ఆశాజనకమైన షాట్లు ఆడినా, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఆ తర్వాతి బంతికే స్టార్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మెయర్ (0) కూడా బుమ్రాకే వికెట్ సమర్పించుకోవడం జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (11 బంతుల్లో 11; 1 సిక్స్), శుభమ్ దూబే (9 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిసేపు క్రీజులో నిలిచినా, ఎక్కువ సేపు ముంబై బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. దూబేను హార్దిక్ పాండ్యా, జురెల్‌ను కర్ణ్ శర్మ ఔట్ చేశారు.

ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (2 ఓవర్లలో 12 పరుగులిచ్చి 2 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (2 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు) అత్యంత ప్రభావం చూపారు. దీపక్ చాహర్ (2 ఓవర్లలో 13 పరుగులిచ్చి 1 వికెట్), హార్దిక్ పాండ్యా (1 ఓవర్లో 2 పరుగులిచ్చి 1 వికెట్), కర్ణ్ శర్మ (1 ఓవర్లో 10 పరుగులిచ్చి 1 వికెట్) కూడా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనంలో కీలక పాత్ర పోషించారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ స్కోరు 7 వికెట్లకు 82 పరుగులు కాగా... ఆర్చర్ (8*), మహీశ్ తీక్షణ (1*) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ముంబై ఇండియన్స్ తమ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే.

Vaibhav Suryavanshi
Rajasthan Royals
Mumbai Indians
IPL 2024
Cricket Match
Jasprit Bumrah
Trent Boult
Deepak Chahar
Yashasvi Jaiswal
Shivam Dube

More Telugu News