Narendra Modi: కాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ... విమానాశ్రయంలో కలకలం

Gannavaram Airport Incident During PM Modis Visit
  • గన్నవరం విమానాశ్రయంలో 1,400 మందితో కట్టుదిట్టమైన భద్రత
  • ప్రధాని పర్యటన వేళ ఎయిర్ పోర్టులో ఒక ప్రయాణికుడి రచ్చ
  • మోదీ పర్యటన నేపథ్యంలో కార్గో సేవలు నిలిపివేత
అమరావతి పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు సృష్టించిన కలకలం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

ప్రధాని రాకను పురస్కరించుకుని గన్నవరం విమానాశ్రయం పూర్తిగా పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. దాదాపు 1,400 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రతను 15 సెక్టార్లుగా విభజించి, ఒక్కో సెక్టార్‌కు ఎస్పీ లేదా ఏఎస్పీ స్థాయి అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ప్రధాని పర్యటన ముగిసే వరకు కార్గో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సరైన టికెట్, గుర్తింపు పత్రాలు ఉన్న ప్రయాణికులను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ప్రధాని పర్యటన వేళ గన్నవరం విమానాశ్రయంలో స్వల్ప కలకలం చోటుచేసుకుంది. కోల్‌కతా వెళ్లేందుకు వచ్చిన ముగ్గురు ప్రయాణికులలో ఒకరు ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో తోటి ప్రయాణికులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. దేశ ప్రధాని అత్యంత కీలకమైన పర్యటన సమయంలో ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన భద్రతా అధికారులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, ఓ ప్రైవేట్ క్యాబ్ ద్వారా గన్నవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుడి ప్రవర్తనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

షెడ్యూల్ ప్రకారం, ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌లో అమరావతిలోని వెలగపూడికి బయలుదేరి వెళతారు. అక్కడ రాజధాని అమరావతిలో సుమారు రూ. 49 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 5.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.
Narendra Modi
Gannavaram Airport
Amaravati
Andhra Pradesh
PM Modi Visit
Airport Security
India
Modi's Andhra Visit
Development Projects
Gannavaram incident

More Telugu News