Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... టెక్ దిగ్గజాలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

Andhra Pradesh to Build Quantum Valley in Amaravati
  • అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ఒప్పందం
  • ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీతో ఏపీ ప్రభుత్వ ఎంవోయూ
  • భారత్ లోనే తొలి, శక్తివంతమైన ఐబీఎం 'క్వాంటం సిస్టం 2' ఏర్పాటు
  • 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ తో కంప్యూటర్
  • 2026 జనవరి 1న కార్యకలాపాల ప్రారంభ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం కంప్యూటింగ్ రంగంలో దేశానికే మార్గదర్శిగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అమరావతిలో అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కోసం నేడు ఐబీఎం (IBM), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L&T) వంటి దిగ్గజ సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

ఈ ఒప్పందంలో భాగంగా, టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం.. భారతదేశంలోనే మొట్టమొదటి, అత్యంత శక్తివంతమైన ‘క్వాంటం సిస్టం 2’ను అమరావతిలో నెలకొల్పనుంది. ఇది 156 క్యూబిట్ సామర్థ్యం కలిగిన అత్యాధునిక హెరాన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రతిష్ఠాత్మక క్వాంటం వ్యాలీ కార్యకలాపాలను 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో ఐటీ విప్లవానికి ఏపీ ఊతమిచ్చినట్లే, ఇప్పుడు క్వాంటం విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "ఇది ఏపీకే కాదు, దేశానికే చారిత్రక దినం" అని ఆయన అన్నారు. భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు క్వాంటం కంప్యూటింగ్ పునాది అవుతుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలన్నారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవంతో, దీన్ని కూడా వేగంగా పూర్తి చేస్తామని, ఎల్&టీకి ఇప్పటికే స్థలం కేటాయించామని తెలిపారు. పనుల పర్యవేక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

భారత్‌లో ఐబీఎం క్వాంటం సిస్టం 2ను స్థాపించడం దేశ క్వాంటం ప్రయాణంలో కీలక మలుపు అని ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా అన్నారు. ఈ భాగస్వామ్యం క్వాంటం అల్గారిథమ్‌ల అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. క్వాంటం, క్లాసికల్ వ్యవస్థల అనుసంధానంతో జీవశాస్త్రం, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని టీసీఎస్ సీటీవో డాక్టర్ హారిక్ విన్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పరిశోధన, అభివృద్ధికి ఊతం లభిస్తుందని టీసీఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Quantum Valley
IBM
TCS
L&T
Quantum Computing
Amaravati
Technology Park
Quantum System 2

More Telugu News