Pawan Kalyan: అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తయారవుతుంది... గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసింది : పవన్ కల్యాణ్

Pawan Kalyan speech Amaravati
  • అమరావతి రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్న పవన్
  • గత ప్రభుత్వం దివిసీమ ఉప్పెనలా అమరావతిని తుడిచి వేసిందని మండిపాటు
  • మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దూసుకుపోతుందని ధీమా
ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. ఒక్క పిలుపుతో రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు. అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని... రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని అన్నారు. ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు గెలుపొందారని చెప్పారు. 

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తాము బాధ్యులుగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. రాజధానిని అద్భుతంగా నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఎన్డీయే కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దివిసీమ తుపానులా అమరావతిని గత ప్రభుత్వం తుడిచిపెట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల త్యాగాలను మర్చిపోలేమని చెప్పారు. 

పహల్గామ్ దుర్ఘటనలో 27 మంది మరణించారని... ఈ సమయంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీ అమరావతి కోసం ఇక్కడకు రావడం... అమరావతిపై ఆయనకున్న ఇష్టానికి నిదర్శనమని పవన్ అన్నారు. ఎంతో విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని కితాబిచ్చారు. ఎంతో దూరదృష్టితో హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు... ఇప్పుడు అమరావతికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
Pawan Kalyan
Amaravati
Andhra Pradesh
Capital City
Farmers
Chandrababu Naidu
Narendra Modi
Development
AP Politics
World-Class City

More Telugu News