Bengaluru IT Park Harassment: సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ రాలేదు: బెంగళూరు ఐటీ పార్కులో వేధింపులకు గురైన యువతి

Bengaluru IT Park Harassment Womans Cry for Help Ignored
  • బెంగళూరు ఎకో వరల్డ్‌లో మహిళపై ద్విచక్ర వాహనదారుడి వేధింపులు
  • బుధవారం రాత్రి 11:30కు వేధింపులకు పాల్పడినట్లు వెల్లడి
  • సహాయం కోరినా చుట్టుపక్కల వారు స్పందించలేదని ఆవేదన
బెంగళూరులోని రద్దీగా ఉండే ఐటీ పార్కులో ఓ యువతిపై వ్యక్తి వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి బాధితురాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ వివరించారు. ఇలాంటి నేరాలపై మహిళలు, ప్రజలు గళం విప్పాలని, అప్పుడే నేరస్థులు తప్పించుకోకుండా ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు.

బుధవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో మారతహళ్లి ప్రాంతంలోని ఎకో వరల్డ్ ఐటీ పార్కులో నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ఎవరో బలంగా కొట్టినట్లు అనిపించిందని బాధితురాలు తెలిపారు. "మొదట నేను గందరగోళానికి గురయ్యాను. ఎవరో వాహనాన్ని అజాగ్రత్తగా నడుపుతున్నారేమో అనుకున్నాను. కానీ, అదే సంఘటన రెండోసారి జరిగింది. అప్పుడు ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని నాకు అర్థమైంది" అని ఆమె వివరించారు.

సహాయం కోసం గట్టిగా కేకలు వేసినా ఎవరూ ముందుకు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "మూడోసారి ఆ వ్యక్తి యూటర్న్ తీసుకుని నా వైపు రావడం గమనించాను. నేను సహాయం కోసం అరిచాను. అక్కడ చాలా మంది ఉన్నారు. ఆ ప్రాంతం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. నేను ప్రజలను, ఆటో డ్రైవర్లను ఆపి సహాయం అడిగాను. కానీ ఎవరూ నాకు సహాయం చేయడానికి రాలేదు. అదే నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది" అని ఆమె అన్నారు.

పోలీసుల దర్యాప్తు

ఈ సంఘటన తర్వాత తాను ఎకో వరల్డ్‌లోని సెక్యూరిటీ బూత్‌కు వెళ్లగా అక్కడ సహాయం లభించిందని బాధితురాలు తెలిపారు. గురువారం పోలీసులను ఆశ్రయించగా డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు ఈ కేసును వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు.

"దర్యాప్తు కొనసాగుతోంది. ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకుంటారని భావిస్తున్నాను. ఈ ఘటన నాకు జరిగింది. ఆ వ్యక్తికి శిక్ష పడకపోతే అతను ఇతరుల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తాడు" అని ఆమె అన్నారు. ఇలాంటి నేరాలకు ఎవరినో నిందించడం కంటే సమాజంలో మార్పు కోసం ప్రజలు వ్యక్తిగత స్థాయిలో బాధ్యత తీసుకోవడం ప్రారంభించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
Bengaluru IT Park Harassment
Woman Harassed in Bengaluru
Marathahalli Eco World IT Park
Bengaluru Crime
Cyber Harassment
India Crime News
Women's Safety
Bystander Effect
Bengaluru Police Investigation

More Telugu News