Sreesanth: సంజూ శాంసన్ వ్యవహారంలో శ్రీశాంత్ పై మూడేళ్ల నిషేధం

Sreesanth Banned for 3 Years by KCA
  • సంజూ శాంసన్ ఎంపికపై కేసీఏకు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు
  • శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం విధించిన కేరళ క్రికెట్ అసోసియేషన్
  • ఏప్రిల్ 30న కొచ్చిలో జరిగిన కేసీఏ సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం
  • నిరాధార ఆరోపణలపై సంజూ శాంసన్ తండ్రిపై నష్టపరిహారం దావాకు తీర్మానం
భారత మాజీ బౌలర్ ఎస్. శ్రీశాంత్‌కు కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) గట్టి షాకిచ్చింది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎంపిక వివాదంలో అసోసియేషన్‌పై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై శ్రీశాంత్‌పై మూడేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు కేసీఏ ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 30న కొచ్చిలో జరిగిన కేసీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్‌లోని కొల్లాం ఏరీస్ ఫ్రాంచైజీకి శ్రీశాంత్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. గతంలో శ్రీశాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనతో పాటు కొల్లాం ఏరీస్, అలప్పుజా టీమ్ లీడ్, అలప్పుజా రిపుల్స్ ఫ్రాంచైజీలకు కూడా కేసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే, ఫ్రాంచైజీలు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా ఉండటంతో వాటిపై తదుపరి చర్యలు తీసుకోవడం లేదని కేసీఏ స్పష్టం చేసింది. కానీ, భవిష్యత్తులో జట్టు యాజమాన్యంలో సభ్యులను నియమించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించినట్లు పేర్కొంది.

ఇదే సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. సంజూ శాంసన్ పేరును ఉపయోగించి అసోసియేషన్‌పై నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను, అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్‌తో పాటు మరో ఇద్దరిపై నష్టపరిహారం కోరుతూ దావా వేయాలని కూడా సర్వసభ్య సమావేశం తీర్మానించినట్లు కేసీఏ తన ప్రకటనలో తెలిపింది.

రెండు ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్, ఓ మలయాళం టీవీ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో కేసీఏను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్‌కు తాను అండగా నిలుస్తానని, కేరళ ఆటగాళ్లను కాపాడుకుంటానని చెబుతూ కేసీఏపై ఆరోపణలు చేసినట్లు తెలిసింది. అయితే, సంజూకు మద్దతు తెలిపినందుకు కాదని, కేవలం అసోసియేషన్‌పై తప్పుదోవ పట్టించే, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకే శ్రీశాంత్‌కు నోటీసు ఇచ్చామని కేసీఏ గతంలోనే వివరణ ఇచ్చింది.

విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు నుంచి సంజూ శాంసన్‌ను తప్పించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ పరిణామమే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టులో సంజూకు చోటు దక్కకపోవడానికి కారణమైందని భావించిన నేపథ్యంలో శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Sreesanth
Sanju Samson
Kerala Cricket Association
KCA
Ban
Controversial Remarks
Indian Cricketer
Kollam Aries
Legal Action
Dispute

More Telugu News