Skype: ఇక స్కైప్ కనిపించదు!

Skype to Shut Down Microsoft Announces End of Service
  • మే 5 నుంచి స్కైప్ సర్వీసు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్
  • స్కైప్ యూజర్లను టీమ్స్ వైపు మళ్లించేందుకు మైక్రోసాఫ్ట్ చర్యలు
  • స్కైప్ తో పోలిస్తే టీమ్స్ మరింత ఆధునిక, ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని అందిస్తుందన్న మైక్రోసాఫ్ట్
దాదాపు రెండు దశాబ్దాలుగా వీడియో కాలింగ్ సేవలు అందించిన స్కైప్ ఇకపై కనుమరుగు కానుంది. కరోనా సమయంలో ఈ టెక్నాలజీ సర్వీస్ బాగా ప్రాచుర్యం పొందింది. కొవిడ్ సమయంలో చాలా మంది ఉద్యోగులు, వ్యాపార సంస్థలు స్కైప్ సేవలను విరివిగా ఉపయోగించారు.

అయితే, కొవిడ్ అనంతరం యూజర్ల నుంచి ఆదరణ తగ్గడం, మార్కెట్‌లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడం, మైక్రోసాఫ్ట్ తన కమ్యూనికేషన్ వేదికలను ఏకీకృతం చేయడంతో స్కైప్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మే 5 నుంచి స్కైప్ సేవలను నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించింది. స్కైప్ యూజర్లను మైక్రోసాఫ్ట్ టీమ్స్ వైపు మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.

మెసేజింగ్, వీడియో కాల్స్ వంటి ఇతర సర్వీసుల కోసం మైక్రోసాఫ్ట్ తన ప్రాథమిక వేదికగా టీమ్స్‌పై దృష్టి పెడుతోంది. స్కైప్ యూజర్లను సైతం టీమ్స్‌లో చేరమని కొంతకాలంగా కోరుతోంది. ఇప్పటికే చాలా మంది యూజర్లు టీమ్స్‌కు మారిపోయారు. స్కైప్ కొన్నేళ్లుగా మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికీ జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్ వంటి పోటీదారులు కూడా ఈ సేవలను అందిస్తున్నారు.

దీంతో ఆఫీసు 365లో భాగంగా ఉన్న మైక్రోసాఫ్ట్ టీమ్స్ వైపు యూజర్లను నడిపించేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది. స్కైప్ నుంచి టీమ్స్‌కు మారేందుకు యూజర్లకు మైక్రోసాఫ్ట్ చాలా నెలల సమయం ఇచ్చింది. చాట్ హిస్టరీలు, కాంటాక్ట్‌లను నిరాటంకంగా టీమ్స్‌కు బదిలీ చేస్తామని కూడా మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది. స్కైప్‌తో పోలిస్తే టీమ్స్ మరింత ఆధునిక, సమగ్ర అనుభవాన్ని అందిస్తుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. 
Skype
Microsoft Teams
Video Calling
Microsoft
Zoom
Google Meet
WhatsApp
Communication Platforms
Online Meetings
Skype Shutdown

More Telugu News