YS Sharmila: మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదు: షర్మిల

YS Sharmila Blasts Modis Approach to Amaravati Funds
  • మోదీ అమరావతికి మట్టి, సున్నమే ఇచ్చారన్న ఏపీసీసీ చీఫ్
  • విభజన హామీలపై ప్రధాని స్పష్టత ఇవ్వలేదని అసంతృప్తి
  • కేంద్రం నిధులు తేలేని చంద్రబాబు ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారని విమర్శ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అయినప్పటికీ, ప్రధాని మోదీ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.

"మోదీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందే. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. మరి ప్రధాని మోదీ గారు మనకు ఇస్తున్నది ఏమిటి? 

ఆనాడు 2015లో మట్టి కొట్టారు. నేడు సున్నం కొట్టి వెళ్ళారు. 10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారు. మళ్ళీ "అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం" అంటూ బూటకపు మాటలు చెప్పారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుంచి అన్ని చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారు. అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు? 

అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా? కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా? పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా? చంద్రబాబు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోదీని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నట్లు తెలుసుకోవాలి. ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు గారు.. మళ్ళీ మోదీని పిలిచి అదే గోతిలో పగలు పడ్డారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు.. నిధులు. రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అప్పు పుట్టనిదే జీతాలకు దిక్కులేదని చెప్పే మీరు రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి రూ.60 వేల కోట్లు అప్పు తెస్తున్నారు? వడ్డీల భారం మోసేదెలా?  వరల్డ్ బ్యాంక్, ADB, KFW, హడ్కోల దగ్గర రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు? ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తి వాటిని అమ్మి రాజధాని ఎలా కడతారు? కేంద్రం మెడలు వంచే దమ్ములేక భావితరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి" అని షర్మిల డిమాండ్ చేశారు. 
YS Sharmila
Amaravati
Andhra Pradesh
Narendra Modi
Chandrababu Naidu
Funds for Amaravati
AP Capital
Central Government
Special Category Status
Andhra Pradesh Politics

More Telugu News