Czech Republic: హైకింగ్ కు వెళితే కోట్ల విలువ చేసే సంపద కనిపించింది!

Hikers Discover Millions in Gold During Hike
  • చెక్ రిపబ్లిక్‌ పోడ్కర్కోనోసి పర్వతాల్లో హైకర్లకు అరుదైన నిధి
  • 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు వెలుగులోకి
  • నిధి విలువ ప్రాథమికంగా రూ. 2.87 కోట్లుగా అంచనా
  • 19వ శతాబ్దం నాటి నాణేలు, 100 ఏళ్ల క్రితం దాచిపెట్టి ఉంటారని భావన
  • ఫిబ్రవరిలో లభ్యం, తాజాగా వెల్లడించిన ఈస్ట్ బొహెమియన్‌ మ్యూజియం
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పర్వతాల్లో హైకింగ్ చేయడం కొందరికి సరదా. అయితే, చెక్‌ రిపబ్లిక్‌లో ఇద్దరు పర్యాటకులకు ఈ సరదా ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో గల పోడ్కర్కోనోసి పర్వతాల్లో వారికి వందల ఏళ్ల నాటి బంగారు నిధి లభించింది. ఈ విషయాన్ని స్థానిక మ్యూజియం అధికారులు తాజాగా వెల్లడించారు.

చెక్ రిపబ్లిక్ చట్టాల ప్రకారం, ఇలాంటి నిధిని కనుగొన్నవారికి దాని విలువలో పది శాతం బహుమతిగా లభించే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి నెలలో ఇద్దరు వ్యక్తులు పోడ్కర్కోనోసి పర్వత ప్రాంతంలో హైకింగ్ చేస్తున్నారు. అలా నడుచుకుంటూ వెళుతున్న వారికి ఒకచోట అనుమానాస్పదంగా కొన్ని వస్తువులు కనిపించాయి. పరిశీలించి చూడగా, అక్కడ బంగారు నాణేలు, కొన్ని ఆభరణాలు, పాతకాలం నాటి పొగాకు సంచులు బయటపడ్డాయి. వెంటనే వారు ఈ సమాచారాన్ని అధికారులకు అందించారు. పురావస్తు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని నిధిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 598 బంగారు నాణేలు, ఇతర వస్తువులను గుర్తించారు.

ఈ నిధిని ప్రస్తుతం ఈస్ట్ బొహెమియన్‌ మ్యూజియంలో భద్రపరిచారు. దీనిపై పరిశోధన చేసిన అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ బంగారు నాణేలు దాదాపు 1808 కాలం నాటివని, వీటిలో ఫ్రాన్స్, బెల్జియం, నాటి ఒట్టోమాన్‌ సామ్రాజ్యానికి చెందిన నాణేలు ఉన్నాయని గుర్తించారు. సుమారు 1921 తర్వాత ఎవరో ఈ నిధిని ఇక్కడ భూమిలో దాచిపెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. అంటే వంద సంవత్సరాలకు పైగా ఈ నిధి భూగర్భంలోనే ఉండిపోయింది. దీని ప్రాథమిక విలువే సుమారు 3,40,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 2.87 కోట్లు) ఉంటుందని మ్యూజియం అధికారులు తెలిపారు.

"హైకర్లు ఈ నిధిని మాకు చూపించినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాం. దీనిపై ఇంకా పూర్తిస్థాయి విశ్లేషణ జరగాల్సి ఉంది" అని మ్యూజియం ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అనిశ్చిత రాజకీయ, సామాజిక పరిస్థితులు నెలకొన్న కాలంలో భవిష్యత్తు అవసరాల కోసం లేదా భద్రత కోసం ఇలా విలువైన వస్తువులను భూమిలో దాచిపెట్టడం పూర్వకాలంలో ఒక ఆచారంగా ఉండేదని, బహుశా ఆ కాలంలోనే దీనిని దాచి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు ఈ నిధిని ఇక్కడ దాచిపెట్టి ఉండవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Czech Republic
Hiking
Gold Treasure
Podkrkonosi Mountains
Ancient Gold Coins
Hidden Treasure
East Bohemian Museum
Unexpected Discovery
Historical Artifact

More Telugu News