Uttar Pradesh: యూపీలో దారుణం.. పెళ్లికి కొన్ని రోజుల ముందు యువ‌తిపై యాసిడ్ దాడి!

 Man Throws Acid on Woman Days Before Wedding in UP
  • ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఘటన
  • తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్య‌క్తితో పెళ్లి నిశ్చ‌యం
  • త‌న‌కు ద‌క్క‌నిది.. ఇంకెవ్వ‌రికీ ద‌క్క‌కూడ‌దంటూ యువ‌తిపై యాసిడ్ దాడి
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్య‌క్తితో పెళ్లి నిశ్చ‌యం కావ‌డం జీర్ణించుకోలేక‌పోయాడో వ్య‌క్తి. పెళ్లికి కొన్ని రోజుల ముందు ఆమెపై యాసిడ్ దాడికి పాల్ప‌డ్డాడు. 25 ఏళ్ల రీమా (పేరు మార్చబడింది) బ్యాంకు నుంచి ఇంటికి వెళుతుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఆపారు. "నువ్వు నాకు ద‌క్క‌కుంటే.. ఇంకెవ్వ‌రికీ ద‌క్క‌కూడ‌దు" అని ఆ వ్యక్తులలో ఒకరు ఆమెపై యాసిడ్ పోశారు.

ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రీమాను ప్రేమించిన‌ నిందితుడు రామ్ జనమ్ సింగ్ పటేల్.. ఆమె వివాహం మరో వ్యక్తితో ఖాయం కావ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయాడు. గురువారం ఆమె బ్యాంకు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమెపై యాసిడ్ పోశాడు. దాంతో ఆమె ముఖం, భుజం, మెడపై తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం 60 శాతం కాలిన గాయాలతో ఆమె అజంగఢ్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. రీమాకు మే 27న పెళ్లి కావాల్సి ఉంది. ఆ వివాహాన్ని ఆపే ఉద్దేశంతో అతను ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. 

దాంతో బాధితురాలి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు రామ్ జనమ్ సింగ్ పటేల్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అలాగే ఈ సంఘటనలో ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. రీమాపై యాసిడ్ దాడి చేసి, గాయ‌ప‌ర‌చ‌డం ద్వారా పెళ్లి ఆపాల‌ని చూసిన‌ట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఇందులో భాగంగా ఆమె వీపుపై యాసిడ్ పోయాలని అనుకున్నానని అతను పోలీసులకు చెప్పాడు.

కాగా, గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమెతో పాటు ఇద్దరు కుమార్తెలపై యాసిడ్ పోసిన ఘ‌ట‌నను మరువకముందే ఇప్పుడు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.


Uttar Pradesh
Acid Attack
Mau District
Ram Janam Singh Patel
India
Crime News
Arrest
Domestic Violence
Pre-Wedding Attack

More Telugu News