Sunil Gavaskar: ధోనీ ఎప్పుడూ సీఎస్‌కే విష‌యంలో అదే ఆలోచిస్తాడు.. స‌న్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Dhonis CSK Strategy Sunil Gavaskars Interesting Comments
  • ఈ ఐపీఎల్‌ సీజ‌న్‌లో అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన సీఎస్‌కే
  • ధోనీ కెప్టెన్సీలోనూ వ‌రుస ఓట‌ములు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మ‌ణ‌
  • ఇదే ఎంఎస్‌డీకి చివ‌రి సీజ‌న్ అంటూ ప్ర‌చారం
  • ఈ నేప‌థ్యంలో క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు  
ఈసారి ఐపీఎల్‌ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. రెగ్యుల‌ర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కార‌ణంగా టోర్నీ మ‌ధ్య‌లో త‌ప్పుకోవ‌డంతో ధోనీ కెప్టెన్సీ చేప‌ట్టాడు. అత‌ని కెప్టెన్సీలో కూడా ఆ జ‌ట్టు విజ‌యాల బాట ప‌ట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వ‌రుస ఓట‌ముల‌తో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన తొలి జ‌ట్టుగా చెన్నై నిలిచింది. 

ఈ క్ర‌మంలో ఈరోజు బెంగ‌ళూరు వేదిక‌గా త‌న త‌ర్వాతి మ్యాచ్‌కు సిద్ధ‌మైంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)తో చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా సీఎస్‌కే త‌ల‌ప‌డ‌నుంది. ఇక‌, ఎంఎస్‌డీకి ఇదే చివ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్క‌ర్ ఎంఎస్‌డీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ధోనీ నిర్ణ‌యం ఎప్పుడూ క‌రెక్ట్‌గానే ఉంటుంద‌ని తెలిపాడు. అత‌డు ఎప్పుడూ త‌న నిర్ణ‌యం సీఎస్‌కేకు మంచిదా కాదా అనే ఆలోచిస్తాడని, అందుకే బ‌హుశా ఈ సీజ‌న్ ఆడుతున్నాడ‌ని స‌న్నీ చెప్పుకొచ్చాడు. 

"ఏ ఆట‌గాడైనా స‌రే, త‌న స్వ‌ప్ర‌యోజ‌నం కంటే తాను ప్రాతినిధ్యం వ‌హించే జ‌ట్టు ల‌బ్ధి కోసం నిర్ణ‌యాలు తీసుకుంటాడు. మ‌హీ ఈ సీజ‌న్‌లో ఆడాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం కూడా అందులో భాగ‌మే. చెన్నై జ‌ట్టుకు ఏది మంచిదైతే త‌ను అదే చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. భ‌విష‌త్తులోనూ ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే సీఎస్‌కేకు మంచిదా కాదా అనే ఆలోచిస్తాడు. అంతేగానీ త‌నకోసం ఆలోచించ‌డు" అని గ‌వాస్క‌ర్ అన్నాడు. 

చెన్నై జ‌ట్టుకు స‌న్నీ కీల‌క సూచ‌న‌..
ఈ సంద‌ర్భంగా స‌న్నీ సీఎస్‌కేకు కీల‌క సూచ‌న చేశాడు. ఈ సీజ‌న్‌లో చెన్నై జ‌ట్టులో ఇంతుకుముందులా పెద్ద‌గా దూకుడు క‌నిపించ‌లేద‌ని అన్నాడు. ఆ జ‌ట్టు బౌలింగ్ విభాగం చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని తెలిపాడు. వ‌చ్చే సీజ‌న్‌లో బ‌లంగా తిరిగి రావాలంటే బౌలింగ్‌పై దృష్టిసారించాల‌ని సూచించాడు. కేవ‌లం బ్యాట‌ర్ల‌పైనే ఆశ‌లు పెట్టుకోకూడ‌ద‌న్నాడు. బౌలింగ్ విభాగం కూడా చాలా కీల‌కమ‌ని పేర్కొన్నాడు. నిల‌క‌డ‌గా వికెట్లు ప‌డ‌గొట్టే బౌల‌ర్ల‌ను తీసుకోవాల‌ని తెలిపాడు. 

ఈసారి జ‌రిగిన వేలంలో సీఎస్‌కే బౌల‌ర్ల‌ను ఎంచుకోవ‌డంలో ఇత‌ర జ‌ట్ల‌తో పోలిస్తే వెనుక‌బ‌డింద‌న్నాడు. వ‌చ్చే సీజ‌న్ ముందు మినీ వేలం ఉందంటున్నారు క‌నుక బౌలింగ్ విభాగాన్ని చెన్నై బ‌లోపేతం చేసుకోవ‌డంపై దృష్టిపెడితే బాగుటుంద‌ని గ‌వాస్క‌ర్ సూచించాడు.   
Sunil Gavaskar
MS Dhoni
CSK
IPL 2023
Chennai Super Kings
IPL
Cricket
Dhoni Captaincy
CSK Bowling
Rutherford Gaikwad

More Telugu News