Romario Shepherd: 14 బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన షెపర్డ్... ఆర్సీబీ భారీ స్కోరు

Shepherds 14 Ball Fifty Powers RCB to Massive Score
  • చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ × సీఎస్కే
  • ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 213/5
  • కోహ్లీ, బెతెల్ అర్ధసెంచరీలు
  • చివర్లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన రొమారియో షెపర్డ్
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరుగుతున్న ఈ పోరులో, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (62), జాకబ్ బెథెల్ (55) అర్ధ శతకాలతో బలమైన పునాది వేయగా, చివర్లో రోమారియో షెపర్డ్ (53*) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించడం హైలైట్ గా నిలిచింది. 

ఇది ఐపీఎల్ లోనే రెండో ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ. ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. 2023 సీజన్ లో జైస్వాల్ 13 బంతుల్లోనే అర్ధసెంచరీ నమోదు చేశాడు. ఇక, కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ 14 బంతుల్లో అర్దసెంచరీ సాధించగా, ఇప్పుడు రొమారియా షెపర్డ్ వారిద్దరి సరసన చేరాడు.

నేటి మ్యాచ్ లో, ఇన్నింగ్స్ ఆరంభించిన ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లీ, బెథెల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తనదైన శైలిలో చెలరేగాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ జాకబ్ బెథెల్ కూడా దూకుడుగా ఆడి 33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది.

అయితే, బలమైన స్థితిలో కనిపించిన ఆర్సీబీని చెన్నై బౌలర్ మతీశ పతిరణ దెబ్బతీశాడు. వరుస విరామాల్లో కీలక వికెట్లు పడగొట్టాడు. ముందుగా ప్రమాదకరంగా మారుతున్న బెథెల్‌ను, ఆ తర్వాత క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన దేవ్‌దత్ పడిక్కల్ (15 బంతుల్లో 17), కెప్టెన్ రజత్ పాటిదార్ (15 బంతుల్లో 11)లను పెవిలియన్ పంపాడు. జితేష్ శర్మ (7) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. నూర్ అహ్మద్ అతడిని ఔట్ చేయగా, కోహ్లీ వికెట్‌ను సామ్ కరన్ తీశాడు.

ఒక దశలో 17.4 ఓవర్లకు 157/5 స్కోరుతో ఆర్సీబీ ఇన్నింగ్స్ నెమ్మదించినట్లు కనిపించినా, చివర్లో వచ్చిన రోమారియో షెపర్డ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆఖరి ఓవర్లలో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 14 బంతులు ఎదుర్కొన్న షెపర్డ్, 4 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 53 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ (378.57) విధ్వంసానికి అద్దం పడుతోంది. షెపర్డ్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీ స్కోరు 200 మార్కును దాటి 213 పరుగులకు చేరింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఏకంగా 33 పరుగులు పిండుకున్నాడు.

చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు. సామ్ కరన్ (3 ఓవర్లలో 34 పరుగులకు 1 వికెట్) పర్వాలేదనిపించాడు. అయితే, ఖలీల్ అహ్మద్ (3 ఓవర్లలో 65 పరుగులు) అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్‌లకు వికెట్లు దక్కలేదు. 

కాగా, ఆర్సీబీ ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో సీఎస్కే బౌలర్ పతిరణ వికెట్ తీసిన ఆనందంలో ధ్యానం చేస్తున్నట్టుగా సెలబ్రేట్ చేసుకోవడాన్ని కోహ్లీ వింతగా చూడడం అందరి దృష్టిని ఆకర్షించింది. 
Romario Shepherd
RCB
IPL 2025
Chennai Super Kings
Virat Kohli
Jacob Bethell
Cricket
IPL Match
Fifty in 14 balls
Match Highlights

More Telugu News