Kranti Kumar: భీమిలి వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు

Bheemili Woman Murder Case Solved Kranti Kumar Arrested
  • శుక్రవారం సగం కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
  • దర్యాప్తులో హతురాలు వివాహిత వెంకటలక్ష్మిగా గుర్తింపు
  • ఆరు ప్రత్యేక బృందాల దర్యాప్తులో క్రాంతికుమార్‌ను నిందితుడుగా తేల్చిన పోలీసులు
  • మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి  
విశాఖపట్నం జిల్లా భీమిలిలో జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ పరిధిలోని 26వ జాతీయ రహదారి పక్కన గల ఫార్చ్యూన్ హిల్స్ ఉడా లేఅవుట్‌లో శుక్రవారం ఉదయం సగం కాలిన స్థితిలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హంతకులు ఆమెను గొంతు కోసి, ఆపై పెట్రోల్ పోసి దహనం చేసినట్లు గుర్తించారు.

మృతురాలి మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో ఆమె వివాహిత అని నిర్ధారించారు. కేసును ఛేదించేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న క్రాంతికుమార్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. క్రాంతికుమార్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. అతను తన రెండో భార్యతో కలిసి మృతురాలి ఇంటి పక్కనే నివసిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటలక్ష్మితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో క్రాంతి కుమార్ రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరగడంతో అతను తన రెండో భార్యను వేరే బ్లాక్‌కు మార్చాడు.

అయినప్పటికీ, క్రాంతి కుమార్ వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయంపై మొదటి భార్య, రెండో భార్యతో తరచూ గొడవలు జరుగుతుండటంతో పాటు, వెంకటలక్ష్మి తనతోనే ఎక్కువ సమయం గడపాలని ఒత్తిడి చేయడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని క్రాంతి కుమార్ పథకం వేశాడు. అందులో భాగంగా ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ఆమెను బైక్‌పై బయటకు తీసుకువెళ్లాడు. మార్గమధ్యలో బైక్‌ కు పెట్రోల్ కొట్టించడంతో పాటు ఒక బాటిల్‌లో పెట్రోల్ నింపాడు. అనంతరం శారీరకంగా కలుద్దామని దాకమర్రి లేఅవుట్‌కు తీసుకువెళ్లి, అక్కడ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

ఇది దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించేందుకు ఆమె ఒంటిపై నగలు తీసుకుని, పెట్రోల్ పోసి తగులబెట్టాడు. పోలీసుల దర్యాప్తులో ముందుగా మృతురాలు వెంకటలక్ష్మి అని గుర్తించారు. ఆ తర్వాత క్రాంతితో కలిసి వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని మృతురాలి కుమారుడు పోలీసులకు చెప్పడంతో, పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపి నిందితుడు క్రాంతికుమార్‌ను అరెస్టు చేశారు. 
Kranti Kumar
Bheemili Murder
Visakhapatnam Crime
Extramarital Affair
Murder Case Solved
Andhra Pradesh Police
Venkatalakshmi
Wife Murder
Fortune Hills Layout
Dakamarri

More Telugu News