Khawaja Asif: హడలిపోతున్న దాయాది దేశం... భారత వాయుసేన దాడి చేస్తుందేమోనన్న పాక్ మంత్రి

Pakistan Minister Fears Indian Air Strike
  • 36 గంటల్లో భారత్ దాడి చేస్తుందని ఇటీవల వ్యాఖ్యానించిన పాక్ రక్షణ మంత్రి
  • తాజాగా భారత వాయుసేన దాడి చేస్తుందంటూ వ్యాఖ్యలు
  • భారత రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నామని వెల్లడి
  • భారత్‌తో భవిష్యత్తులో ఘర్షణలు పెరుగుతాయన్న అంచనా
పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారత్ తమపై ఏ క్షణంలో ప్రతీకార దాడులు చేస్తుందోనన్న భయం పాకిస్థాన్ నేతల్లో కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా పాక్ మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. భారత్ తమపై 36 గంటల్లో దాడి చేయనుందంటూ కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ గడువు ముగిసి నాలుగు రోజులు గడిచినా భారత్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో, ఆయన ఇప్పుడు కొత్త వాదనలను తెరపైకి తెచ్చారు. భారత్ వాయుసేన తమపై దాడి చేసే అవకాశాలున్నాయని తాజాగా అంచనా వేశారు.

పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారత రఫేల్ యుద్ధ విమానాలను తమ వాయుసేన విజయవంతంగా అడ్డుకుందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలను ఆయన వెల్లడించలేదు.

మరోవైపు, జియో న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఖవాజా ఆసిఫ్ మరింత తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. సింధు నదిపై భారత్ ఏదైనా నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తే, దానిని దాడి చేసి కూల్చివేస్తామని ఆయన బెదిరించారు. భారత్ అలాంటి ప్రయత్నాలు చేయడమే దురాక్రమణగా పరిగణిస్తామని పేర్కొన్నారు. "దౌర్జన్యం అంటే కేవలం తూటాలు పేల్చడం మాత్రమే కాదు, నీటిని ఆపడం, మళ్లించడం వంటివి కూడా దౌర్జన్యమే. అదే జరిగితే పాకిస్థాన్ ఆకలి చావులను చూడాల్సి వస్తుంది. వారు (భారత్) ఏదైనా నిర్మాణానికి ప్రయత్నిస్తే, పాక్ దానిని కూల్చేస్తుంది" అంటూ ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాలక్రమేణా భారత్‌తో ఘర్షణలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, తగ్గే సూచనలు కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దేందుకు పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని కూడా ఆయన తెలిపారు.

గత నెల చివర్లో, భారత్‌లో జరిగిన సీసీఎస్ (క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశం అనంతరం, ఉగ్రవాదులపై చర్యలకు భారత సైన్యానికి పూర్తి అధికారాలు లభించిన నేపథ్యంలో, ఖవాజా ఆసిఫ్ సంచలన ప్రకటన చేశారు. భారత్ 24 నుంచి 36 గంటల్లో తమపై సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొనడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అయితే, ఆయన చెప్పినట్లుగా ఎటువంటి దాడి జరగకపోవడంతో, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Khawaja Asif
Pakistan Defense Minister
India-Pakistan Relations
India Air Force
Pakistan Air Force
Surgical Strike
Rafale Jets
Sindhu River
Terrorism
Pulwama Attack

More Telugu News