Nara Lokesh: శ్రీ మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh Visits Mahankaali Temple
  • కంఠంరాజ కొండూరు మహంకాళీ ఆలయ పునఃప్రతిష్ట ఉత్సవానికి హాజరైన మంత్రి లోకేశ్
  • అమ్మవారికి ప్రత్యేక పూజలు... పసుపు, కుంకుమ, గాజులు సమర్పణ
  • విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర ఉపాలయాల సందర్శన
  • బకింగ్‌హోం కాలువ పరిశీలన, గుర్రపు డెక్క తొలగింపునకు ఆదేశం
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. దుగ్గిరాల మండలం కంఠంరాజ కొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు ఆలయ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తొలుత అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, సారెను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందించి, జ్ఞాపికను బహూకరించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలను కూడా మంత్రి సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. మంత్రి రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల టీడీపీ మండల అధ్యక్షురాలు కేసమనేని అనిత తదితరులు పాల్గొన్నారు.

ఆలయ కార్యక్రమాన్ని ముగించుకుని మంగళగిరికి తిరుగు పయనమైన మంత్రి లోకేశ్, మార్గమధ్యంలో కాజ-చినవడ్లపూడి మధ్య ఉన్న బకింగ్‌హోం కాలువను పరిశీలించారు. కాలువలో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోయి ఉండటాన్ని ఆయన గమనించారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో, రైతులకు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తక్షణమే గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.
Nara Lokesh
Minister Nara Lokesh
Andhra Pradesh Minister
Mahankaali Temple
Mangalagiri
Duggirala
Kanthamraj Konduru
Temple Visit
Political News Andhra Pradesh
Andhra Pradesh Politics

More Telugu News