Munir Ahmad: పాక్ మహిళను పెళ్లి చేసుకుని... ఇప్పుడు మోదీయే న్యాయం చేయాలంటున్న జవాన్!

CRPF Jawan Seeks Modis Intervention After Dismissal for Marrying Pakistani Woman
  • పాకిస్థానీ మహిళను పెళ్లాడిన సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ అహ్మద్
  • వివాహ సమాచారం దాచారంటూ ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు
  • అధికారులకు ముందే చెప్పానని, ఆధారాలున్నాయని మునీర్ వాదన
  • తన ఉద్వాసన అన్యాయమని, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
పాకిస్థానీ మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని గోప్యంగా ఉంచాడన్న ఆరోపణలపై మునీర్ అహ్మద్ అనే సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్‌ను విధుల నుంచి తొలగించడం తెలిసిందే. అయితే, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, అధికారులకు ముందే సమాచారం ఇచ్చానని ఉద్వాసనకు గురైన జవాన్ మునీర్ అహ్మద్ వాదిస్తున్నాడు. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

సీఆర్పీఎఫ్ 41వ బెటాలియన్‌లో పనిచేస్తున్న మునీర్ అహ్మద్, గత ఏడాది మే నెలలో పాకిస్థాన్‌కు చెందిన మెనల్ ఖాన్‌ను వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమె వీసాపై భారత్‌కు వచ్చింది అయితే, ఈ వివాహ విషయాన్ని మునీర్ తమ దృష్టికి తీసుకురాలేదని, పైగా ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడే ఉంచుకున్నారని సీఆర్పీఎఫ్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, పాక్ జాతీయులు స్వదేశానికి వెళ్లాలని భారత్ సూచించిన తరుణంలో ఈ విషయం బయటపడింది.

అయితే, అధికారుల ఆరోపణలను మునీర్ అహ్మద్ ఖండించాడు. తాను పాక్ మహిళను పెళ్లి చేసుకోబోతున్న విషయం అధికారులకు ముందే చెప్పానని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు. "2024లో మెనల్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాను. ఆమెతో ప్రేమ వ్యవహారం గురించి 2022 నుంచే అధికారులకు తెలియజేస్తున్నాను. ఇందులో దాచిపెట్టడానికి ఏముంది? నన్ను ఉద్యోగం నుంచి తొలగించారని తెలియగానే షాక్‌కు గురయ్యాను. నా తప్పేమీ లేకుండా, కావాలనే నన్ను తొలగించారు" అని మునీర్ వాపోయాడు.

"ఒక జవానుగా నాకు న్యాయం జరగాలి. ఈ అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయమని కోరతాను" అని మునీర్ అహ్మద్ పేర్కొన్నాడు. 
Munir Ahmad
CRPF Jawan
Pakistani Wife
Marriage
Dismissal
Modi
Amit Shah
India-Pakistan Relations
Violation of Rules
Menal Khan

More Telugu News