Chandrababu Naidu: మోదీ చేతుల మీదుగా అమరావతి పనుల పునఃప్రారంభానికి కారణం ఇదే: చంద్రబాబు

Chandrababu Naidu on Amaravatis Relaunch
  • టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • అమరావతి పునఃప్రారంభ కార్యక్రమ విజయంపై కార్యకర్తలకు అభినందనలు
  • మే 18 నాటికి కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయం
  • కడపలో మే 27-29 మహానాడు 
  • ప్రభుత్వ కార్యక్రమాలపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవ‌ల జరిగిన అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమ విజయం కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నేతలందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సభ.. గతంలో జరిగిన అన్ని సభలను మించి విజయవంతమైందని, ఈ కార్యక్రమంతో దేశం, ప్రపంచం దృష్టి మరోసారి అమరావతిపై కేంద్రీకృతమైందని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలవడానికి కారణం ఇదేనని వెల్లడించారు. 

"అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం చాలా బాగా జరిగింది. సభ విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలందరినీ అభినందిస్తున్నా. రాష్ట్రానికి గతంలో ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పటికీ ఈసారి అన్నింటినీ మరిపించేలా ఈ సభ జరిగింది. రాజధాని పనుల పునఃప్రారంభం కార్యక్రమంతో దేశం, ప్రపంచం దృష్టి అమరావతిపై మళ్లింది. అమరావతి ఆవశ్యకతను తెలియజేసేందుకు, పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభం చేశాం. 

వికసిత్ భారత్‌ 2047కు అమరావతి బలమైన పునాదిగా మారుతుందని ప్రధాని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఇక ఇబ్బందులు లేకుండా ముందుకెళుతుంది. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక. యువతకు అవకాశాలు, ఉద్యోగాలు కల్పించే విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. 

ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తామని ప్రధాని మోదీ, నేను, పవన్ కళ్యాణ్ చెప్పాం. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక గతి తప్పిన రాష్ట్రాన్ని గాడినపెట్టాం. పోలవరానికి నిధులు రాబట్టి 2027 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. మూతబడే స్థితిలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు ఊపిరిపోసి రూ.11,400 కోట్లు కేంద్రం నిధులు కేటాయించేలా చేసుకున్నాం. ఉత్తరాంధ్ర వాసుల కల అయిన రైల్వేజోన్ సాధించాం. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 

ప్రతినెలా 1వ తేదీనే పేదలకు పింఛను ఇస్తున్నాం. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం. దీపం2 కింద కోటి మందికిపైగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేలు అందిస్తాం. 

కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ప్రభుత్వం చేపడుతున్న కారక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికశాతం కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, కోపరేటివ్, ఏఎంసీ ఛైర్మన్‌ల నామినేటెడ్ పదవులను భర్తీ చేశాం. మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. సామాజిక న్యాయం పాటించి పదువులకు ఎంపిక చేస్తున్నాం. పార్టీ సంస్థాగత ఎన్నికలు కూడా నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు మే 18 నాటికి పూర్తి చేయాలి.

ఈ సారి మహానాడును కడపలో మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించుకుంటున్నాం. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ పూర్తి చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయి. సభ్యత్వం తీసుకున్న వారికి కార్డులు కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేయాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కార్యకర్తల, ప్రజల అభిప్రాయాల మేరకు నాయకులు పని చేయాలి. 

గుజరాత్ మోడల్ ఏపీలోనూ అమలవ్వాలి. సుస్థిర ప్రభుత్వం ఉండటంతో గుజరాత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోంది... తిప్పికొట్టండి. ప్రభుత్వానికి ఇచ్చినంత ప్రాధాన్యతే పార్టీకి కూడా ఇస్తున్నా. ఏడాది పాలనలోనే స్పష్టమైన మార్పులు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించాం" అని చంద్రబాబు వివరించారు. 
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Narendra Modi
Capital Development
Telugu Desam Party
State Development
India Politics
Pawan Kalyan
Gujarat Model

More Telugu News