Prabhsimran Singh: పంజాబ్ పరుగుల సునామీ... లక్నో ముందు భారీ లక్ష్యం

Punjab Kings Massive Total Against Lucknow Super Giants in IPL
  • లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
  • పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 236 పరుగులు
  •  ప్రభ్‌సిమ్రన్ సింగ్ (91), శ్రేయస్ అయ్యర్ (45) దూకుడు
  • లక్నో బౌలర్లలో ఆకాశ్ మహరాజ్ సింగ్, దిగ్వేశ్ సింగ్ రాఠికి చెరో రెండు వికెట్లు
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. లక్నో బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. ఆదివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 236 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (91) విధ్వంసక ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఆరంభంలోనే ప్రియాంశ్ ఆర్య (1) వికెట్‌ను పంజాబ్ కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 48 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 91 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో దిగ్వేశ్ రాఠి బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

మరోవైపు, వన్‌డౌన్‌లో వచ్చిన జోష్ ఇంగ్లిస్ (14 బంతుల్లో 30; 1 ఫోర్, 4 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ వేగంగా పరుగులు జోడించడంతో పంజాబ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

మిడిలార్డర్‌లో నెహాల్ వధేరా (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తన వంతు సహకారం అందించాడు. చివరి ఓవర్లలో శశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) భారీ షాట్లతో చెలరేగారు. వీరిద్దరి మెరుపులతో పంజాబ్ కింగ్స్ 230 పరుగుల మార్కును దాటింది.

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో ఆకాశ్ మహరాజ్ సింగ్, దిగ్వేశ్ సింగ్ రాఠి తలా రెండు వికెట్లు పడగొట్టారు. ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. అయితే, మయాంక్ యాదవ్ (4 ఓవర్లలో 60 పరుగులు), అవేష్ ఖాన్ (4 ఓవర్లలో 59 పరుగులు) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 
Prabhsimran Singh
Punjab Kings
Lucknow Super Giants
IPL 2023
Cricket Match
Dharmashala
T20 Cricket
Indian Premier League
Cricket Score
Babar Azam

More Telugu News