Supreme Court: ఎర్ర‌కోటపై మొఘ‌ల్ వార‌సురాలి దావా... పిటిషన్‌ను తిరస్క‌రించిన‌ సుప్రీంకోర్టు

Sultana Begums Red Fort Claim Rejected by Supreme Court
  • మొఘ‌ల్ సామ్రాజ్యం చివ‌రి చ‌క్ర‌వ‌ర్తి బ‌హ‌దూర్ షా జాఫ‌ర్ వార‌సురాలిగా చెప్పుకుంటున్న సుల్తానా బేగం
  • ఎర్ర‌కోట‌ను త‌మ‌కు అప్ప‌గించాలంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్‌ 
  • బేగం పిటిష‌న్‌ను కొట్టివేసిన‌ చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం
ఎర్ర‌కోట‌పై దాఖ‌లైన దావాను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొఘ‌ల్ సామ్రాజ్యానికి చెందిన చివ‌రి చ‌క్ర‌వ‌ర్తి బ‌హ‌దూర్ షా జాఫ‌ర్ వార‌సురాలిగా చెప్పుకుంటున్న సుల్తానా బేగం సుప్రీంకోర్టులో ఒక పిటిష‌న్‌ వేసింది. ఢిల్లీలోని ఎర్ర‌కోట‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని ఆమె త‌న పిటిష‌న్‌లో పేర్కొంది. అయితే, చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టిస్ పీవీ సంజ‌య్ కుమార్‌తో కూడిన ధ‌ర్మాస‌నం సుల్తానా బేగం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సోమవారం కొట్టివేసింది. ఆ దావా పూర్తిగా త‌ప్పుదోవ ప‌ట్టించే రీతిలో ఉంద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. 

సుల్తానా బేగం ఎర్రకోటపై మాత్రమే ఎందుకు దృష్టి పెట్టిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎందుకంటే బేగం చెప్పినట్లుగా ఆమె నిజంగా చివరి మొఘల్ చక్రవర్తి వార‌సురాలైతే ఆమె ఇతర స్మారక చిహ్నాలకు, మొత్తం పురాతన నగరం ఫతేపూర్ సిక్రీకి వంశపారంపర్యంగా చెప్పుకోవచ్చని పేర్కొంది.

"ఎందుకు ఎర్రకోట మాత్రమే? ఫతేపూర్ సిక్రీ ఎందుకు కాదు? వాటిని ఎందుకు వదిలివేయాలి? రిట్ పూర్తిగా త‌ప్పుదోవ ప‌ట్టించే రీతిలో ఉంది. అందుకే కొట్టివేయడం జ‌రిగింది" అని ధర్మాసనం పేర్కొంది.

ఎర్రకోటను త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఆ తర్వాత పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

2021లో తొలిసారి సుల్తానా బేగం హైకోర్టును ఆశ్ర‌యించింది. రెండ‌వ బ‌హ‌దూర్ షా జాఫ‌ర్ ముని మ‌న‌వ‌డికి చెందిన భార్య‌ను అని ఆమె త‌న పిటిష‌న్‌లో పేర్కొంది. 1857లో స్వాతంత్ర్య స‌మరం ప్రారంభ‌మైన స‌మ‌యంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ త‌మ ప్రాప‌ర్టీల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఆమె ఆరోపించింది. 

ఆ త‌ర్వాత బ‌హ‌దూర్ షా జాఫ‌ర్‌ను దేశం నుంచి త‌రిమేశార‌ని, మొఘ‌ల్స్ ఆస్తుల్ని అక్ర‌మంగా స్వాధీనం చేసుకున్న‌ట్లు ఆమె పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ ప్రాప‌ర్టీ భార‌త ప్ర‌భుత్వం ఆధీనంలో ఉంద‌ని, అందుకే ఆ ప్రాప‌ర్టీని త‌మ‌కు అప్ప‌గించాల‌ని సుల్తానా కోర్టులో కేసు దాఖ‌లు చేసింది.

డిసెంబ‌ర్ 2021లో సింగిల్ జ‌డ్జి ఈ పిటిష‌న్ కొట్టివేశారు. ఇన్నేళ్లుగా ఆ ప్రాప‌ర్టీ ఇత‌రుల ఆధీనంలో ఉంద‌ని తెలిసి ఇన్నాళ్లూ ఎందుకు జాప్యం చేసిన‌ట్లు అని జ‌డ్జి ప్ర‌శ్నించారు. కేసు ఫైల్ చేయ‌డంలో తీవ్ర‌ ఆల‌స్య‌మైన‌ట్లు హైకోర్టు అప్ప‌ట్లోనే పేర్కొంది.
Supreme Court
Sultana Begum
Red Fort
Mughal
Bahadur Shah Zafar
Supreme Court of India
Delhi High Court
India
Property Claim
Legal Case
Historical Landmark

More Telugu News