Team India: ఐసీసీ ర్యాంకింగ్స్... వ‌న్డేలు, టీ20ల్లో టీమిండియానే టాప్‌

Team India Tops ICC ODI and T20 Rankings
  • వైట్-బాల్ ఫార్మాట్లలో టీమిండియా ఆధిపత్యం
  • టెస్టుల్లో ఆస్ట్రేలియా జ‌ట్టుకు నంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌
  • భార‌త్‌కు నాలుగో స్థానం
ఐసీసీ సోమవారం విడుదల చేసిన పురుషుల క్రికెట్‌కు చెందిన వార్షిక ర్యాంకింగ్స్‌లో వైట్-బాల్ ఫార్మాట్లలో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొన‌సాగించింది. వన్డేలు, టీ20లలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ, రెడ్‌-బాల్ ఫార్మాట్‌లో మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. ఇందులో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. 2024 మే నుంచి ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా ర్యాంకుల‌ను వెల్ల‌డించింది. 

వ‌న్డే ర్యాంకుల్లో టీమిండియా అగ్ర‌స్థానంలో ఉంది. ఇటీవ‌ల ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీని గెలుచుకున్న‌ భార‌త్ త‌న రేటింగ్ పాయింట్ల‌ను 122 నుంచి 124కు పెంచుకుని టాప్ ర్యాంక్ కైవ‌సం చేసుకుంది. చాంపియ‌న్స్ ట్రోఫీ ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన న్యూజిలాండ్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. 

అటు, టీ20ల్లో టీమిండియానే టాప్‌లో ఉంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉండ‌గా... ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్ జ‌ట్లు ఉన్నాయి. 

కాగా, టెస్టుల్లో ఆస్ట్రేలియా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఆ జ‌ట్టు వార్షిక పాయింట్లు 15 నుంచి 13కు త‌గ్గినా... పాట్ క‌మ్మిన్స్ నేతృత్వంలోని ఆసీస్‌ 126 ఓవరాల్ పాయింట్ల‌తో టాప్‌లో నిలిచింది. 

అలాగే బెన్ స్టోక్స్ సార‌థ్యంలోని ఇంగ్లండ్ జ‌ట్టు రెండో స్థానానికి ఎగ‌బాకింది. ద‌క్షిణాఫ్రికా, భార‌త్‌ను ఆ టీమ్ వెన‌క్కినెట్టింది. ఈ ఏడాది ఆడిన 4 టెస్టుల్లో ఇంగ్లండ్‌ మూడింటిలో విజ‌యం సాధించింది. ఇంగ్లండ్ 113 కాగా రేటింగ్ పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉండ‌గా... ద‌క్షిణాఫ్రికా 111, టీమిండియా 105 పాయింట్ల‌తో మూడు, నాలుగ‌వ స్థానాల్లో ఉన్నాయి.
Team India
ICC Rankings
ODI Rankings
T20 Rankings
Test Rankings
Australia
New Zealand
England
Pat Cummins
Ben Stokes

More Telugu News