Pakistan Cyber Attacks: భారత రక్షణ శాఖ వెబ్‌సైట్లపై పాకిస్థాన్ హ్యాకర్ల దాడి

Pakistan Hacker Attack on Indian Defense Websites
  • పహల్గామ్ దాడి తర్వాత..  సైబర్ దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్
  • సున్నితమైన సమాచారం, లాగిన్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కి ఉండవచ్చని ఆందోళన
  • మరిన్ని సైబర్ దాడులు జరగకుండా భారత రక్షణ వ్యవస్థ అప్రమత్తం
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తానీ హ్యాకర్లు భారత రక్షణ రంగ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సైబర్ దాడుల వల్ల రక్షణ సిబ్బందికి సంబంధించిన సున్నితమైన సమాచారం, లాగిన్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కి ఉండవచ్చని రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (MES), మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌ (IDSA)లకు చెందిన కీలక సమాచారాన్ని హ్యాక్ చేసినట్లు 'పాకిస్తాన్ సైబర్ ఫోర్స్' అనే ఎక్స్ ఖాతా ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్  వెబ్‌సైట్‌పై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ వెబ్‌సైట్‌ను ఆఫ్‌లైన్‌లో ఉంచి, జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహిస్తున్నారు.

పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాకర్ల నుంచి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిఘా ఉంచారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను పటిష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో నిలిపివేయబడిన 'పాకిస్తాన్ సైబర్ ఫోర్స్' ఖాతా గతంలో ఆర్మర్డ్ వెహికిల్ నిగమ్ లిమిటెడ్ వెబ్ పేజీ చిత్రాన్ని పోస్ట్ చేసింది. అందులో భారత ట్యాంక్ స్థానంలో పాకిస్తాన్ ట్యాంక్‌ను మార్ఫింగ్ చేసినట్లు కనిపించింది.

మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ డేటాను హ్యాక్ చేశామని, మీ భద్రత ఓ భ్రమ అని పేర్కొంటూ కొందరు రక్షణ సిబ్బంది పేర్లతో మరో పోస్ట్ చేసింది. ఐడీఎస్ఏ వెబ్‌సైట్ నుంచి 1,600 మంది యూజర్లకు చెందిన 10 జీబీకి పైగా డేటాను సేకరించినట్లు కూడా ఈ హ్యాకర్ల బృందం ప్రకటించింది.
Pakistan Cyber Attacks
Indian Defense Websites Hacked
Military Engineer Services
Manohar Parrikar Institute for Defence Studies and Analyses
Armed Vehicle Nigam Limited
Cybersecurity Breach
India-Pakistan Tension
Data Breach
Cyber Warfare
Nationa

More Telugu News