Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ష్నైడర్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ

Andhra Pradesh Govt Signs MoU with Schneider Electric in Presence of Minister Nara Lokesh
  • ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ
  • రాష్ట్రవ్యాప్తంగా 20 అత్యాధునిక ట్రైనింగ్ ల్యాబ్ ల ఏర్పాటు 
  • సుమారు 9 వేల మందికి ప్రపంచస్థాయి శిక్షణ, ప్లేస్‌మెంట్ సపోర్ట్
  • మంగళగిరిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అనంతపురంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా, ప్రఖ్యాత సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చింది.

ఈ ఒప్పందం ద్వారా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2027 మార్చి మధ్య కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎన్ఏసి (NAC) శిక్షణా కేంద్రాల్లో మొత్తం 20 అత్యాధునిక ట్రైనింగ్ ల్యాబ్ లను ష్నైడర్ ఎలక్ట్రిక్ ఏర్పాటు చేయనుంది. ఈ ల్యాబ్ లలో ఆధునిక విద్యుత్ వ్యవస్థలు, సౌరశక్తి పరికరాలు, పారిశ్రామిక ఆటోమేషన్ టెక్నాలజీ వంటివి అందుబాటులో ఉంటాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో సుమారు 9 వేల మంది యువతకు ఈ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 

శిక్షణా పరికరాలు, వినియోగ వస్తువులు, డిజిటల్ శిక్షణా సామగ్రి కోసం ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ దాదాపు రూ. 5 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. అంతేకాకుండా, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ (ప్లేస్‌మెంట్) ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తుంది.

మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి మేరకు, రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో మంగళగిరిలో 'ష్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేసేందుకు కంపెనీ అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతోపాటు, అనంతపురంలో ఒక రీసెర్చ్ సెంటర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యుత్ వినియోగాన్ని ఆధునికీకరించే 'మోడ్రన్ పవర్ ఆప్టిమైజేషన్' పైలెట్ ప్రాజెక్టును కూడా ష్నైడర్ చేపట్టనుంది.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఏపీఎస్ఎస్‌డీసీ తన వంతుగా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. అలాగే, శిక్షణ కార్యక్రమాల ప్రాముఖ్యత గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచి, వారిని భాగస్వాములను చేస్తుంది. ఈ శిక్షణ కోసం 4 న్యాక్ సెంటర్లు (అమరావతి, కుప్పం, డిజిటల్ కమ్యూనిటీ భవన్-పి.ఎం. లంక, చిత్తూరు), 9 ప్రభుత్వ ఐటీఐలు (అరకు, రాజమండ్రి (మహిళలు), నర్సీపట్నం, నూజివీడు, ఒంగోలు (బాలురు), ఎ.ఎస్. పేట, కార్వేటినగరం (మహిళలు), కడప (మైనారిటీలు), శ్రీశైలం), 7 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు (శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, చంద్రగిరి, నంద్యాల, గన్నవరం, ఒంగోలు) ఎంపికయ్యాయి.
Nara Lokesh
Schneider Electric
Andhra Pradesh Government
Skill Development
ITI Training
Polytechnic Colleges
Green Energy
Electronics
Job Opportunities
MoU

More Telugu News