Nadeendla Manohar: చెప్పులు విడిచి ధాన్యం కల్లాలలో నడిచిన మంత్రి నాదెండ్ల

Minister Nadeendla Walks Through Paddy Fields in Kakinada
  • అకాల వర్షాలతో తడిసిన ధాన్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయి పరిశీలన
  • కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్ మండలాల్లో పర్యటన
  • రైతులతో నేరుగా మాట్లాడి, ప్రభుత్వ అండపై భరోసా కల్పించిన మంత్రి
  • ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని, దళారుల బారిన పడొద్దని హితవు
రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులకు ప్రభుత్వ అండపై భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఉదయం పెద్దాపురం మండలం జే.తిమ్మాపురం, జగ్గంపేట మండలం కాట్రాపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర అధికారులతో కలిసి కల్లాల్లో ఆరబోసిన, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల కాళ్లకు ధరించిన చెప్పులు విడిచి కల్లాల్లో నడిచారు. తద్వారా, చెప్పులతో ధాన్యం తొక్కకూడదన్న రైతుల సెంటిమెంట్ ను గౌరవించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షం వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని ప్రభుత్వం పూర్తిగా అర్థం చేసుకుందని, ప్రతి రైతునూ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

అనంతరం కాకినాడ రూరల్ మండలం చీడిగా హైవే రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, తొందరపడి దళారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. ప్రభుత్వం ప్రతి గింజనూ బాధ్యత తీసుకుని కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు రైతు సేవా కేంద్రాల ద్వారా 59 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మొత్తం 95 వేల మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి కూటమి ప్రభుత్వం 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేసిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రైతుల ఖాతాల్లో రూ. 11,300 కోట్లు జమ చేశామని గుర్తుచేశారు. జిల్లాలోని 225 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని, గోనె సంచులను అందుబాటులో ఉంచామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఎవరూ అపోహలు నమ్మవద్దని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.

ఈ పర్యటనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఎం. దేవులా నాయక్, వ్యవసాయ శాఖ జేడీ ఎన్. విజయ్ కుమార్, సహకార శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Nadeendla Manohar
Andhra Pradesh Minister
Paddy Procurement
Kakinada
Unseasonal Rains
Farmer Support
Minimum Support Price
Agriculture
AP Government
Crop Damage

More Telugu News