Nara Lokesh: మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు

Minister Nara Lokeshs Key Directives on Mega DSC
  • జూన్ 6 నుంచి మెగా డీఎస్సీ: పకడ్బందీ ఏర్పాట్లకు మంత్రి లోకేశ్ ఆదేశం
  • జీవో 117కు ప్రత్యామ్నాయం; విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బదిలీలు
  • అంబేద్కర్ విదేశీ విద్య పునరుద్ధరణ; బాలికలకు 'కలలకు రెక్కలు' పథకం
  • ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల హామీ
  • ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, గ్రంథాలయాల బలోపేతంపై దృష్టి
రాష్ట్ర విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ, మెగా డీఎస్సీ నిర్వహణ సహా పలు అంశాలపై విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్ష జరిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో సుమారు మూడు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని విభాగాల పనితీరును మెరుగుపరిచే దిశగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మెగా డీఎస్సీ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు 
జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలు, టీసీఎస్ అయాన్ సెంటర్లలో కంప్యూటర్లు, ఇతర మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెట్ అర్హతలే డీఎస్సీకి వర్తిస్తాయని, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్టిఫికెట్ల అప్‌లోడింగ్ కోసం ప్రత్యేక ఆప్షన్ ఇచ్చామని, వెరిఫికేషన్ నాటికి వాటిని సమర్పిస్తే సరిపోతుందని మంత్రి లోకేశ్ వివరించారు.

టెన్త్ రిజల్ట్స్ పై సమీక్ష
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలను సమీక్షించిన మంత్రి, అకడమిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి వచ్చే విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, 'ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు' ప్రాతిపదికన వివాదాస్పద జీవో 117కు ప్రత్యామ్నాయాన్ని రూపొందించినట్లు తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను 'షైనింగ్ స్టార్స్' పేరుతో సన్మానించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు
టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్‌కు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యాశాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది బదిలీలు పూర్తి చేయాలని ఆదేశించారు. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో చేరేలా తల్లిదండ్రులను చైతన్యపరచాలని, పుస్తకాలు, విద్యామిత్ర కిట్లు సకాలంలో సిద్ధం చేయాలని సూచించారు.

కలలకు రెక్కలు' పథకం ప్రారంభించడానికి మార్గదర్శకాలు 
ఉన్నత విద్యపై దృష్టి సారిస్తూ, గత ప్రభుత్వం నిలిపివేసిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన విధివిధానాలను త్వరితగతిన రూపొందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఉన్నత విద్య అభ్యసించే బాలికలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన 'కలలకు రెక్కలు' పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించడానికి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కోరారు. 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు, అధ్యాపకుల కొరత, పనితీరు మెరుగుదల వంటి అంశాలపై చర్చించారు. డిగ్రీ కళాశాలల్లో అమలు చేయనున్న త్రీ-మేజర్, సింగిల్ మేజర్ సబ్జెక్టుల విధానంపై భాగస్వాముల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయడంతో పాటు, క్యూఎస్ టాప్-100 ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోని రెండు విశ్వవిద్యాలయాలు స్థానం సంపాదించేలా ప్రమాణాలను పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు

గ్రంథాలయాల ఆధునీకరణ, లెక్చరర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 205 ప్రభుత్వ గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతకు, ప్రజలకు మరింత ఉపయోగపడేలా ఆధునీకరించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల బదిలీలకు కూడా మంత్రి ఆమోదం తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, కాలేజీ విద్య డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Nara Lokesh
Mega DSC
Andhra Pradesh Education System
Teacher Transfers
AP 10th Results
School Education
Higher Education
Government Libraries
College Admissions
Educational Reforms

More Telugu News