TTD: టీటీడీ శిల్పకళా సంస్థలో ఉచిత కోర్సులు.. దరఖాస్తుల ఆహ్వానం

TTD Offers Free Traditional Sculpture Courses
  • టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర శిల్పకళా శిక్షణ సంస్థ
  • సాంప్రదాయ ఆలయ శిల్పకళ పరిరక్షణకు ప్రత్యేక కృషి
  • డిప్లొమా, కలంకారి సర్టిఫికెట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
  • పదో తరగతి ఉత్తీర్ణత చాలు
  • ఉచిత వసతి, భోజనం; పూర్తయ్యాక రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహం
  • 2025-26 విద్యా సంవత్సర ప్రవేశాలకు జూన్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ
ప్రాచీన భారతీయ ఆలయ నిర్మాణ శిల్పకళను పరిరక్షించి, భావితరాలకు అందించాలనే ఉదాత్త లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ద్వారా ఆసక్తిగల యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ నిర్వహిస్తున్న ఈ తరహా సంస్థ ఇదొక్కటే కావడం గమనార్హం. 1960లో స్థాపించబడిన ఈ సంస్థ, శిల్పశాస్త్ర నియమాలకు అనుగుణంగా భారతీయ సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబించేలా నైపుణ్యం కలిగిన శిల్పులను, స్థపతులను తీర్చిదిద్దుతోంది. ఆలయ వాస్తుశిల్పం, వివిధ రకాల శిల్పకళలు, సంప్రదాయ చిత్రలేఖనం వంటి అంశాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.

అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాలు

ఈ సంస్థలో ప్రధానంగా రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన నాలుగేళ్ల 'డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్' కోర్సులో ఆరు విభాగాలున్నాయి. అవి: ఆలయ నిర్మాణం, శిలా శిల్పం, సుధా (గచ్చు) శిల్పం, లోహ శిల్పం, కొయ్య శిల్పం, సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం. ప్రతి విభాగంలో ఏటా 10 మందికి, మొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుకు అర్హులు.

అలాగే, వస్త్రాలపై చిత్రించే సంప్రదాయ కలంకారి కళలో రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సు కూడా ఉంది. దీనిలో ఏటా 10 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సుకు కూడా పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

ఈ రెండు కోర్సుల్లో చేరిన విద్యార్థులందరికీ టీటీడీ ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తోంది. డిప్లొమా చివరి సంవత్సరం విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన కోసం దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత చారిత్రక ఆలయాలకు ఉచితంగా విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా శిలా శిల్పంలో నైపుణ్యం సాధించిన వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. కలంకారి కోర్సు పూర్తి చేసిన వారు స్వయం ఉపాధి దిశగా రాణించేందుకు అవకాశం ఉంది. ఈ కళకు దేశ విదేశాల్లో మంచి ఆదరణ ఉంది.

ప్రవేశ ప్రక్రియ, ఆర్థిక ప్రోత్సాహం

ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మే లేదా జూన్ నెలలో ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మే 5వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుల్లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థి పేరిట టీటీడీ జాతీయ బ్యాంకులో రూ.లక్ష డిపాజిట్ చేస్తుంది. కోర్సు పూర్తయిన తర్వాత, వారు ఆయా కళల్లో స్థిరపడేందుకు ప్రోత్సాహకంగా ఈ మొత్తాన్ని వడ్డీతో సహా అందజేస్తారు.

ఉపాధి అవకాశాలు

ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇదే సంస్థలో బోధకులుగా, టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో స్థపతులుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా, కాంట్రాక్టర్లుగా అవకాశాలు పొందుతున్నారు. ప్రభుత్వంలోని దేవాదాయ, పర్యాటక, పురావస్తు శాఖల్లో కూడా ఉద్యోగాలు సాధిస్తున్నారు. అనేకమంది జాతీయస్థాయి పురస్కారాలు కూడా అందుకున్నారు. సంస్థకు అనుబంధంగా ఉన్న శిలా శిల్ప ఉత్పత్తి విభాగంలో కొందరు విద్యార్థులు కాంట్రాక్టు పద్ధతిలో దేవతామూర్తుల విగ్రహాలను కూడా తయారు చేస్తున్నారు.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా:

శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ,
తిరుమల తిరుపతి దేవస్థానములు,
అలిపిరి రోడ్, తిరుపతి – 517507,
తిరుపతి జిల్లా.
వెబ్ సైట్: https://ttdevasthanams.ap.gov.in/
ఫోన్ నెం: 0877 – 2264637.
TTD
Tirumala Tirupati Devasthanams
Traditional Sculpture Courses
Free Courses
Diploma in Traditional Sculpture
Kalankari
Temple Architecture
Andhra Pradesh
India
Vocational Training

More Telugu News