Vijaynagaram Teacher: విద్యార్థులను సొంత ఖర్చుతో విమానం ఎక్కించిన విజయనగరం ఉపాధ్యాయుడు.. ఎందుకంటే?

Vijaynagaram Teacher Rewards Top Students with Plane Trip
  • పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో ఫస్టొచ్చిన విద్యార్థులు
  • అంతకుముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఉపాధ్యాయుడు
  • విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి విజయవాడ నుంచి విశాఖకు విమాన ప్రయాణం
విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఓ ఉపాధ్యాయుడు చేసిన పనికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించేందుకు మండల స్థాయిలో ఫస్టు వస్తే విమానం ఎక్కిస్తానని ఉపాధ్యాయుడు హామీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులు మండల స్థాయిలో టాపర్లుగా నిలవడంతో తాజాగా ఆ ఉపాధ్యాయుడు తన హామీని నిలబెట్టుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సొంత ఖర్చుతో విమానం ఎక్కించారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరడాన సత్యారావు తన విద్యార్థులకు ఈ బహుమతి ఇచ్చారు. 

గత నెల 23న వెలువడిన పదో తరగతి ఫలితాల్లో గర్భాం, భైరిపురం పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎస్‌.వివేక్‌ (593), టి.రేవంత్‌ (591) మండల స్థాయిలో ఫస్ట్, సెకండ్ ర్యాంకర్లుగా నిలిచారు. విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో సత్యారావు ఆదివారం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను రైలులో విజయవాడకు తీసుకువెళ్లారు. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో విశాఖపట్నంకు ప్రయాణించారు. అక్కడి నుంచి బస్సులో విజయనగరం తిరిగి వచ్చారు. కాగా, విద్యార్థులను ప్రోత్సహించడానికి సత్యారావు చేసిన పనికి జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, అధికారులు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

కలలకు రెక్కలు.. ఎమ్మెల్యే సౌమ్య ప్రోత్సాహం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ‘కలలకు రెక్కలు’ పేరుతో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇటీవలి ఫలితాల్లో కంచికచర్ల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వెంకట నాగశ్రీసాయి (587), ముప్పాళ్ల గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని చిగురుపాటి యశస్విని (583), తోటరావులపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి పెసరమల్లి అనూష (577), అల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి గూడేరు గణేష్‌ రెడ్డి (573), వెల్లంకి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సిరివేరు నవ్య (570) టాపర్లుగా నిలిచారు. దీంతో ఎమ్మెల్యే సౌమ్య వీరిని మంగళవారం విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళుతున్నారు.
Vijaynagaram Teacher
Andhra Pradesh
School Students
Top Rankers
Maradana Satyaravu
Plane Trip Reward
Educational Initiative
Student Motivation
Academic Excellence
Tangirala Soumya

More Telugu News