Israel: గాజాలో భవనం పేల్చివేస్తూ ఇజ్రాయెల్ సైనికుల ‘జెండర్ రివీల్ పార్టీ’.. వీడియో ఇదిగో!

Israel Soldiers Gender Reveal Party in Gaza Sparks Outrage
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఇజ్రాయెల్ సైన్యం నిర్వాకంపై సర్వత్రా విమర్శలు
  • ప్రజలను తరలించి, హమాస్‌పై దాడులు చేస్తామన్న నెతన్యాహు
గాజాలో ఇజ్రాయెల్ సైనికులు (ఐడీఎఫ్) ఓ నివాస భవనాన్ని పేల్చివేసి 'జెండర్ రివీల్ పార్టీ' చేసుకున్నారనే ఆరోపణలతో కూడిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వీడియోలో, పేలుడు పదార్థాలను అమర్చి సైనికులు ఓ భవనాన్ని పేల్చివేయడం, శిథిలాల నుంచి నీలం, బూడిద రంగు పొగలు రావడం కనిపిస్తోంది. నీలం రంగు పొగ వెలువడడంతో పుట్టబోయేది అబ్బాయే అంటూ జనం కేకలు వేయడం వినిపిస్తోంది.

అల్ జజీరా నివేదిక ప్రకారం, ఈ వీడియోను ఇజ్రాయెల్ సైనికులే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. దీనిపై ఆన్‌లైన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు నెటిజన్లు దీన్ని "హేయమైన చర్య"గా అభివర్ణిస్తూ, ఇందుకు పాల్పడిన వారిని "అమానవీయులు" అని విమర్శించారు. మరికొందరు వారిని పిచ్చివారని అభివర్ణించారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని మరో నెటిజన్ ప్రశ్నించారు.

మరోవైపు, గాజా స్ట్రిప్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, దేశంలో కలిపేసుకోవాలన్న ప్రణాళికలకు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. గాజాలోని పాలస్తీనియన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించి హమాస్‌పై ఊహకందని రీతిలో దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.

జెండర్ రివీల్ పార్టీ అంటే..
గర్బిణీలకు మన దగ్గర నిర్వహించే సీమంతం లాంటి వేడుకే ఈ జెండర్ రివీల్ పార్టీ.. పుట్టబోయేది అమ్మాయా లేక అబ్బాయా అనేది అంచనా వేయడానికి విదేశాల్లో జరుపుకునే సరదా వేడుక. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను బంధుమిత్రుల సమక్షంలో కాబోయే తల్లిదండ్రులు కట్ చేస్తారు. కేక్ లోపల గులాబీ రంగు వస్తే పుట్టబోయేది అమ్మాయని, నీలం రంగు వస్తే అబ్బాయని అంచనా వేస్తారు. కాబోయే తల్లిదండ్రులు సరదాగా జరుపుకునే వేడుక ఇది.
Israel
IDF
Gaza
Gender Reveal Party
Building Demolition
Benjamin Netanyahu
Palestine
Social Media Controversy
International Condemnation
War Crimes

More Telugu News