Justice Surya Kant: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు

Justice Surya Kants Controversial Remarks on Reservations
  • మహారాష్ట్ర ఓబీసీ కోటాపై దాఖలైన కేసును విచారణకు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్
  • దేశంలో రిజర్వేషన్లను రైలు బోగీతో పోల్చిన న్యాయమూర్తి
  • ఒకసారి లోపలికి వెళ్లిన వాళ్లు ఇతరులను రానివ్వరని విమర్శ
  • ఈ ఏడాది చివర్లో సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్
భారత దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను రైలు బోగీతో పోల్చారు. రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్ట్‌మెంట్‌లా మారిపోయిందని, ఒకసారి బోగీలోకి ప్రవేశించిన వారు ఇతరులు రావడానికి ఇష్టపడటంలేదని అన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్లకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, జస్టిస్ సూర్యకాంత్ ఈ ఏడాది చివర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు చివరిసారిగా 2016-17లో జరిగాయి. ఓబీసీ కోటాకు సంబంధించిన న్యాయ పోరాటం కారణంగానే ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2021లో, ఓబీసీలకు 27 శాతం కోటా అమలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల్లో వెనుకబాటుతనంపై కచ్చితమైన గణాంకాల సేకరణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్ల శాతం నిర్ధారణ, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదనే త్రివిధ సూత్రాన్ని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది. అప్పటి నుంచి గణాంకాల సేకరణ, సంబంధిత వ్యాజ్యాల వల్ల ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఇందిరా జైసింగ్, ఓబీసీలను గుర్తించినప్పటికీ, ఆ డేటాను స్థానిక ఎన్నికలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎన్నికలను త్వరగా నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన అధికారుల ద్వారా స్థానిక సంస్థలను ఏకపక్షంగా నడిపిస్తోందని ఆరోపించారు.
Justice Surya Kant
Supreme Court
Reservation System in India
OBC Reservations
Maharashtra Local Body Elections
Caste-based Reservations
Indira Jaising
SC/ST/OBC quotas
50% Reservation Limit
Supreme Court Judge

More Telugu News