Revanth Reddy: ఈయన పోతే చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారట: రేవంత్ పై బండి సంజయ్ సెటైర్

Bandi Sanjays Scathing Attack on Revanth Reddy
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న రేవంత్ రెడ్డి
  • కుటుంబ పెద్దే నిస్సహాయత వ్యక్తం చేస్తే పరిస్థితి ఏమిటన్న బండి సంజయ్
  • రాష్ట్రానికి రూ. 7 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయం కాంగ్రెస్ కు ముందే తెలుసని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని, బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పచ్చి అబద్ధాలు చెప్పడం సరికాదని హితవు పలికారు.

ఎల్లారెడ్డిపేటలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్... రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఢిల్లీ వెళితే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్లు ఇవ్వలేదనడాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈయన అప్పు కోసం వెళితే చెప్పులు ఎత్తుకెళ్లేవాడిలా చూస్తున్నారట... అది బహుశా కాంగ్రెస్ సంస్కృతేమోనని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో సీఎం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారని విమర్శించారు.

ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా రాష్ట్రం దివాళా తీసిందంటూ వారిలో భయాందోళనలు రేకెత్తించడం ఏమిటని సంజయ్ ప్రశ్నించారు. కుటుంబ పెద్దే ఇలా నిస్సహాయత వ్యక్తం చేస్తే పరిస్థితి ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడపలేమనే స్థితికి వచ్చిందని, చేతులెత్తేసిందని ఆయన ఆరోపించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసినట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అన్నారు.

రాష్ట్రంపై రూ. 7 లక్షల కోట్ల అప్పు ఉందని ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి తెలుసని బండి సంజయ్ గుర్తుచేశారు. అప్పుల విషయం తెలిసి కూడా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను దారుణంగా మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా అంగీకరించారని సంజయ్ వ్యాఖ్యానించారు.

వృద్ధులకు రూ. 4 వేల పింఛన్, మహిళలకు నెలకు రూ. 2,500, తులం బంగారం, నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి, విద్యార్థులకు రూ. 5 లక్షల భరోసా వంటి హామీలన్నీ ఉత్తమాటలేనని ఇప్పుడు తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని చేతబట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. ఈ హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు వెంటనే సమాధానం చెప్పి తీరాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కథ 'ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్' అన్నట్లుగా ఉందని, సీఎం వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇలాంటి మోసపూరిత కాంగ్రెస్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. 
Revanth Reddy
Bandi Sanjay
Telangana Finance
Telangana Politics
Congress Party
BJP
Telangana Debt
State Finances
Political Satire
Rahul Gandhi

More Telugu News